రెవెన్యూ శాఖ‌లో ప‌దోన్న‌తులు క‌ల్పించండి

– మంత్రి పొంగులేటిని కోరిన‌ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌

అమరావతి, మహానాడు: రెవెన్యూ శాఖ‌లో అర్హులైన ఉద్యోగులంద‌రికీ ప‌దోన్న‌తులు క‌ల్పించాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ కోరారు. ప‌దోన్న‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యోగులు ఎదురు చూస్తున్న‌ట్టుగా తెలిపారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి గ్రామ స్థాయిలో అనుభ‌వం ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు.

తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి ఆధ్వ‌ర్యంలో అసోసియేష‌న్ ప్ర‌తినిధులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిని మంగళవారం క‌లిశారు. రైతుల‌కు మేలు చేసేలా, బ‌లోపేతానికి ఇటీవ‌ల అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం-2024 ముసాయిదా చాలా బాగుంద‌ని మంత్రికి కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చ‌ట్టంతో రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఈ చ‌ట్టం దేశంలో ఉత్త‌మైన చ‌ట్టంగా మిగిలిపోతుంద‌న్నారు. దీంతో పాటు ఇటీవ‌ల 9 మంది త‌హ‌శీల్దార్ల‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి క‌ల్పించినందుకు కూడా మంత్రికి ధ‌న్యవాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సైతం కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం ముసాయిదాకు అన్ని ర‌కాల స‌హాయ‌, స‌హకారాలు అందించినందుకు సంఘం నేత‌ల‌ను అభినందించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాహ‌నాల బిల్లుల‌ను సైతం త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని మంత్రిని కోరారు. క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు చేప‌ట్టే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. గ్రామానికో అధికారిని నియ‌మించే దాంట్లో రెవెన్యూ శాఖ‌లో అనుభ‌వం ఉన్న వారికే అవ‌కాశం ఇస్తే రైతుల‌కు, ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

కార్య‌క్ర‌మంలో డిప్యూటీ కలెక్టర్లు బి.గీత, ఎన్.నిర్మల, ఎల్. సుధా, రామ్మూర్తి, వెంకటేశం, ఎం.జయమ్మ, విశాలాక్షి, తదితరులు పాల్గొన్నారు.