దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మానవత్వం
అత్యవసర సమయంలో గర్భిణీకి ఆపరేషన్
తల్లి, బిడ్డ సురక్షితం
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ప్రసవ వేదనతో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ప్రాణాపాయంలో ఉన్న గర్భిణీకి ఆపరేషన్ చేసి తల్లి,బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నారు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ ప్రసవ వేదనతో గురువా రం దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. అత్యవసర ఆపరేషన్ అవసరమైంది. డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతూ డాక్టర్ అయిన గొట్టిపాటి లక్ష్మిని సంప్రదించారు.
ఎన్నికల వేళ రాజకీయ ప్రచారం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రచారంలో బిజీగా ఉన్నా మధ్యలోనే ప్రచారం ఆపేసి ప్రసూతి నొప్పులతో ప్రాణాపాయంలో ఉన్న నిండు గర్భిణీకి ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డ ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. ఆ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. తనను, తన బిడ్డను కాపాడారని…ఆ దేవుడే దేవతలాగా పంపి కాపాడారని ఆ తల్లి కృతజ్ఞతలు తెలిపింది. దర్శిలో డెలివరీ చేసే ఆసుపత్రి కూడా మంచిది లేదమ్మా… నువ్వు ఇక్కడే ఆసుపత్రి పెట్టాలమ్మా… తమలాంటి తల్లులు మళ్లీ ఇలాంటి కష్టాలు పడకుండా చూడాలమ్మా అంటూ ఆ తల్లి కరుణ కోరింది. దీనిపై స్పందించిన లక్ష్మి దర్శి ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
డాక్టర్‌గా ప్రజల ప్రాణాలే ముఖ్యం: గొట్టిపాటి లక్ష్మి
నేను ఒక డాక్టర్‌ను…నాకు తల్లి వేదన తెలుసు…ఉమ్మ నీరు పట్టి బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం ఇబ్బంది కావటంతో ఇక్కడ ఉన్న ఆసుపత్రి వారు నన్ను సంప్రదించి ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పారు. ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షించి ఆ తల్లి వేదనను తీర్చేందుకే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా ప్రాణం విలువ తెలిసిన వైద్యురాలిగా వెళ్లి ఆపరేషన్ చేశాను. ఆ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటం నాకెంతో ఆనందం గా ఉంది. ఆ తల్లి మొహంలో పట్టలేని సంతోషాన్ని చూడగలిగాను. ఒక డాక్టర్‌గా వృత్తికి న్యాయం చేయాలి. నాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం. దర్శి ప్రజలకు వైద్యపరంగా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తాను.