వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి

– కమిషనర్ శ్రీనివాసులు

గుంటూరు, మహానాడు: ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి చేస్తుందని, స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు కూడా తోడ్పాటును అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సోమవారం కమిషనర్ కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ను అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని వాకింగ్ ట్రాక్ లు, పార్క్ ల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధిలో స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. సుమారు 20 ఎకరాల్లో ఉన్న కొరెటెపాడు చెరువులో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్ణంగా ఉన్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించామని, త్వరలో పనులు చేపట్టిన అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్‌ ప్రతినిధులతో చర్చించి పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రాక్ లో ఏర్పాటు చేసిన మంచినీటి ఫిల్టర్ ని పరిశీలించి, నీరు బాగుందని, ఫిల్టర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ లో లైట్లు వెలిగేలా, ట్రాక్ కి ఏమైనా మరమతులు ఉంటే చేపట్టాలని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కొరెటెపాడు వాకింగ్ ట్రాక్ నగరంలోనే పెద్దదని, ట్రాక్ వెంబడి పచ్చదనం పెంపొందేలా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమన్వయం చేసుకొని మొక్కలు నాటాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. ట్రాక్ లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ ని మరమత్తు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.

పర్యటనలో సీటీ ప్లానర్ రాంబాబు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఏడిహెచ్ రామారావు, ఏసిపి మురళి, ఎంహెచ్ఓ ఆనందకుమార్, ఎస్ఎస్ సోమ శేఖర్, కొరెటెపాడు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.బాజీ, సిహెచ్.సీతారామయ్య, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.