కూటమికి భగవంతుడు మనోబలం ఇవ్వాలి

-నా భాషా ద్వేషపాలన పోరాటం ఫలించింది
-ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు
-అవనిగడ్డలో రఘురామరాజుకు ఘన స్వాగతం

అవనిగడ్డ: భాషా ద్వేష పాలనకు వ్యతిరేకంగా తాను చేపట్టిన పోరాటం సఫలమయిందని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం అవనిగడ్డ వచ్చిన ఆయనను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.

ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం గత ప్రభుత్వంపై తాను చేపట్టిన పోరాటం ప్రజలు గమనించి, తమ భావాన్ని ఓటు రూపంలో చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అద్భుతమైన విజయం అందించారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన ప్రభుత్వం సుపరిపాలన అందించేలా భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరారు.

సమావేశంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, శీలం అశ్విన్ కుమార్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, చల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని రాజకుమార్ (నాని), చల్లపల్లి మండల టీడీపీ అధ్యక్షులు మోర్ల రాంబాబు, కోడూరు మండల జనసేన అధ్యక్షులు మర్రె గంగయ్య, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.