– కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల సారథ్యంలో సంస్థ బలోపేతం
• ‘మహిళలకు ఉచిత బస్సు’ అమలుకు ప్రభుత్వం సమాయత్తం
– రాష్ట్ర మైన్స్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వ పాలనలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని.. కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల నారాయణరావు సారథ్యంలో ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర మైన్స్ జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. కొనకళ్ల నారాయణరావు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అభినందనసభ నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా రెండు పర్యాయాలు సేవలందించిన కొనకళ్ల నారాయణరావు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు.
పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించే సమయంలో రాష్ట్రం కోసం పరితపించి గుండెపోటుతో స్పృహతప్పిపడిపోయిన వ్యక్తి కొనకళ్ల నారాయణరావు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. గత ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టీసీ సంస్థను నష్టాలబాట పట్టించిందని, కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహించిందన్నారు. సీఎం చంద్రబాబు నమ్మకంతో కొనకళ్లకు ఆర్టీసీ బాధ్యతలు అప్పగించారన్నారు. కొనకళ్ల సారథ్యంలో అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ అభివృద్ధిపథంలో పయనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తిలేదన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఎలక్ట్రానిక్ బస్సుల వల్ల సంస్థకు నష్టం తగ్గుతుందని, ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ఆదాయం పెంచుతామన్నారు. ఆర్టీసీకి ప్రయాణికులు ఎంత ముఖ్యమో, సంస్థలో పనిచేసే కార్మికులు శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యస్థానాలకు చేర్చే ఏపీఎస్ ఆర్టీసీ బాధ్యతలను తనకు అప్పగించారని, ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, వెనిగండ్ల రాము, యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి), బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, పంచకర్ల రమేష్ బాబు, కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామారావు తదితరులు పాల్గొన్నారు.