అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

• రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
• గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తూ ఈ సందర్భంగా ప్రోటెం స్పీకర్ గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గవర్నర్ చేత ప్రోటెం స్పీకర్ గా ఎంపిక కాబడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియామక పత్రాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ శ్రీ. పిపికె. రామాచార్యులు సభలో చదివి వినిపించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీజే భరత్, సవిత, ఎం.రాం ప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ, పి. అదితి గజపతి రాజు, బోండా ఉమా మహేశ్వరరావు, బోడె ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాసులు, సుందరపు విజయ్ కుమార్, ఉన్నతాధికారులు, అధికారులు, తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.