ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– గత ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు
– విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడారు
– మచిలీపట్నం బస్ స్టాండ్‌లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు
– గత ప్రభుత్యం లో రవాణా మంత్రిగా ఉండీ మచిలీపట్నానికి చేసిందేమీ లేదు
– నూతనంగా కొనుగోలు చేసిన ఐదు బస్సుల్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బస్టాండు వద్ద నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు.

ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా గతంలో కార్గో సేవల్ని చంద్రబాబు ప్రారంభించారని, ప్రస్తుతం కొత్త బస్సులతో ఆర్టీసీకి సరికొత్త హంగులు జోడించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించి, తొలివిడతలో 200 బస్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డిపోకు 5 కొత్త బస్సులు కేటాయించారన్నారు.

విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటం ఆడారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి ఆర్టీసీ వ్యవస్థను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాడు చంద్రబాబు తీసుకున్న కార్గో సేవల నిర్ణయంతో ఆర్టీసీకి మెరుగైన ఆదాయం సమకూరుతోందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఆడబిడ్డలకు శుభవార్త చెబుతామని, ఉచిత బస్సు ప్రయాణానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నవారు చేసిందేమీ లేదన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో మురుగు నీరు చేరి అవస్థలు పడుతున్నారు. కనీస సదుపాయాలు కూడా లేక ప్రజలు బస్ ప్రయాణమంటేనే భయపడుతున్నారు. ఇప్పటికీ వర్షం వస్తే రోడ్లపై ఉండాల్సిన మురుగు మొత్తం బస్టాండుకు చేరుతోంది. గత ప్రభుత్వ పాపాల నుండి మచిలీపట్నాన్ని కాపాడుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు