సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం

మెగా డి ఎస్ పి ద్వారా ఉద్యోగ అవకాశాలు
ప్రజల మధ్య ప్రభుత్వం 100 రోజుల పండుగ
వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు
రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

సంబేపల్లి :  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం సంబేపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం – ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నేడు వందరోజుల పండుగను ప్రజల మధ్య జరుపుకుంటున్నామన్నారు.

గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా సాధ్యం కానివి కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో భాగంగా పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మేలు కలుగజేస్తుందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతినెల ఒకటో తేదీన 100% పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.

ఉదయం 5-30 గంటలకంతా పెన్షన్ పంపిణీ దారులు క్షేత్రస్థాయిలో ఉండి 6 గంటలకు పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వడంతో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. గతంలో వాలంటీర్లకు నెలకు 5000 జీతం ఇచ్చి వారిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుని వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు.