తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా – సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గద్దర్ ఫౌండేషన్ ఆగస్టు 6న హైదరాబాద్లో గద్దర్ ప్రథమ వర్ధంతి సభను పెద్దఎత్తున నిర్వహించింది.
సభలో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సందేశం పంపారు. అందులో గద్దర్ పట్ల తనకున్న అపార అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో గద్దర్ స్మృతివనం కోసం హైదరాబాద్ లోని ప్రైం లొకేషన్ నెక్లెస్ రోడ్డులో ఎకరం స్థలం కేటాయిస్తామని, గద్దర్ ఫౌండేషన్ కు మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తామని అధికారికంగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన గద్దర్ పేర సినీ-టీవీ-నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ఇస్తామని మరోసారి గుర్తు చేశారు. (గతంలో నంది అవార్డుల పేర వీటిని ప్రదానం చేశారు – ఇకపై ‘నంది’ పేరగాక గద్దర్ పేర ఇస్తారు). ఇట్లా ఎన్నో వరాలను ప్రభుత్వం కురిపించింది. మరెన్నింటికో సానుకూలతను వ్యక్తపరిచింది. ప్రభుత్వం అలా గద్దర్ ను తనలో పూర్తిగా కలిపేసుకుంది. విచిత్రమేమిటంటే. అదే వేదికపై కొందరు ‘ప్రజా యుద్ధనౌక గద్దర్’ అని నినదించారు. కట్టలు తెగిన ఆవేశంతో మరికొందరు పోటీపడి ఎర్రెర్ర దండాలు పలుకుతూ ప్రసంగించారు. గద్దర్ ఒక విప్లవకారుడని, వీరుడని, అరుణారుణ కిరణమని… మరెన్నో విశేషణాలతో కీర్తించారు. వేదిక దద్దరిల్లేలా చేశారు. ఆ ‘దృశ్యం’ ఎంత పరస్పర విరుద్దాంశమో ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రం…. విషాదమూను.
‘ప్రజా యుద్ధనౌక గద్దర్’ అని బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టినా, పోస్టర్లు అతికించినా, కొందరు అమాయకంగా నినదించినా అంతిమంగా అది “ప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్ ‘గా రూపాంతరం చెంది స్పష్టంగా కనిపిస్తున్నా – వినిపిస్తున్నా గద్దర్ కు అపూర్వ గౌరవం దక్కుతోందన్న ఆనందంలో, హర్షాతిరేకాలతో ఆ వాదనను అభిమానులు బలపరిచారు ఆమోదించారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
అయితే ఆ రెండు నినాదాల మధ్య, భావనల మధ్య భూమి ఆకాశమంత వ్యత్యాసముందని, అవి పరస్పర విరుద్ధ ప్రతిపాదనలని ఆలోచించకుండా, నిశితంగా పరిశీలించకుండా ఊరేగడం మహా విషాదం.
గద్దర్ “ఇమేజి”ని, పేరు ప్రతిష్టల్ని ప్రభుత్వ బంజరుదొడ్డిలో కట్టిస్తే వీరంతా స్వచ్ఛందంగా అందులోకి దూరుతున్నారు. ఇదెంతటి అమాయకత్వం?…..
గద్దర్ ఇమేజి ప్రభుత్వ బంజరుదొడ్డిలో బందీ అయితే ప్రజా యుద్ధానికి, ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న విశేషణానికి అర్థం ఏముంటుంది?…. ఆయన వీరాభిమానుల ఆవేశానికి, ఆర్ద్రతకు విలువ ఏముంటుంది?…
‘ప్రజా యుద్ధ నౌక’ వేరు, ‘ప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్’ వేరు అన్న ఇంగితం మరిస్తే అంతా గందరగోళమే ఆవహిస్తుంది. అమాయకంగా బంజరుదొడ్డిలోకి, బోనులోకి తరుముతుంది. అదే ఇప్పుడు జరిగింది…. జరుగుతోంది.
మరి 1972 నుంచి గద్దర్ దశాబ్దాలపాట యుద్ధాన్ని ఇందుకోసం చేశాడా?… పాటను పాశుపతాస్త్రంగా మలచి పోరాడింది ఇందుకోసమా?…. కాదు – కానేకాదు. కాని చివరకు మిగిలిందేమిటి?…. భక్తి శ్రద్ధలతో ఆ పోరాటాన్ని ప్రభుత్వం కాళ్ళ దగ్గర సమర్పించి లొంగిపోయినతనం, తత్వమే మిగిలింది. ఆత్మ సమర్పణ భావనే గద్దర్ ప్రథమ వర్ధంతి సభలో స్పష్టాతి స్పష్టంగా గోచరమైంది. మరి ఇది ఆహ్వానించదగ్గ పరిణామమా?…. అందరూ ఆలోచించాలి. పేద ప్రజల గుండె చప్పుడు గద్దర్, యుద్ధ నౌక గద్దర్ అన్న మాటలకు మాన్యత ఏముంటుంది?… ఈ దృష్టికోణాన్ని సమాధి చేసి, ప్రజా సంఘాలకు – సంస్థలకు పాతరవేసి ఫౌండేషన్లు – ప్రభుత్వాలపై మోజు పెంచుకుని ఆశయాల్ని ఆవిరిచేస్తూ కొత్త దేవుళ్ళకు మోకరిల్లితే అదే ప్రజా చైతన్యమని, ప్రభంజనమని, విప్లవమని, అభాగ్య ప్రజలకు ఆశచూపితే అదెలా సత్యమవుతుంది? నిజమెలా అనిపించుకుంటుంది?…. 1972లో అప్పటి కాంగ్రెసు ప్రభుత్వంపై, వ్యవస్థపై గద్దర్ నిప్పులు చెరిగి, గోచి – గొంగళి భుజాన వేసుకుని చెలరేగిపోయింది ఈ పతాక సన్నివేశం కోసమా? యుద్ధ నౌకగా తిరుగుబాటు పతాకమెత్తింది ఇలా మోకరిల్లడానికా?…. కాదు మరి జరిగింది, జరుగుతున్నదేమిటి?… నిశితంగా అందరూ ఆలోచించాలి కదా?
గద్దర్ జీవించి ఉన్నప్పుడే అన్ని విలువలకు తిలోదకాలిచ్చి, అనేక బలహీనతలకు తలొగ్గి, అన్నిటా రాజీపడి కాంగ్రెసు అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని బహిరంగంగా ముద్దుపెట్టి, ముద్దుజేసి, ఆయన తల్లి కాంగ్రెసు అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీతో ములాఖత్ అయి, ఆత్మ సమర్మణ చేసి, తన ఇమేజిని ప్రాదాక్రాంతం చేసి తన కుమారుడు సూర్యానికి టికెట్ కోసం కాంగ్రెస్ నాయకుల ఎక్కే గుమ్మం – దిగే గుమ్మంగా తిరిగినా ఫలితం దక్కకపోయినా తన విధేయతను వీసమెత్తు తగ్గకుండా కొనసాగిస్తూ, అన్నింటికి అండగా గద్దర్ నిలిచాడు. అప్పుడే ప్రజాయుద్ధ నౌక గద్దర్ కాదని తేటతెల్లమైంది. అభిమానులు దాన్ని ప్రతిఘటించన దాఖలాలు లేవు.
చివరకు ఆయన మరణానంతరం ఆయన కూతురు వెన్నెలకు గత శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ దక్కింది. అలా కాంగ్రెసు పార్టీ గద్దర్నే కాదు ఆయన కుటుంబమంతటిని తనలో కలిపేసుకుంది. ఆయన అభిమానులు మౌనంగా ఆమోదించి ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని నినదిస్తే ఎలా స్ఫూర్తిదాయకమవుతుంది? ఇంత స్పష్టంగా కాంగ్రెసు వర్ణచిత్రం కనిపిస్తున్నా. “డీప్ స్ట్రాటజీ” గోచరిస్తున్నా గద్దర్ అభిమానులు గద్దరన్న ఆశయాల్ని కొనసాగిస్తాం, సాధిస్తాం అంటూ పిడికిలి బిగించి నినదించడం, ప్రథమవర్ధంతి సభలో ఎర్రెర్ర దండాలు పలకడం, స్మృతి గీతాలు ఆలపించడం, గద్దర్ యాదిలో ముందుకు సాగుతాం… అని ప్రతిజ్ఞలు చేయడంచూస్తే అదెక్కడా “సింక్” అయిన అంశంగా కనిపించలేదు. అది పూర్తిగా ఆత్మవంచనగానే ఆవిష్కృతమైంది.
వర్తమానంలో మారిన సమాజాన్ని పసిగట్టకుండా, కంప్యూటర్ లిటరసీ, డిజిటల్ టెక్నాలజీ ప్రతివ్యక్తిని పలుకరిస్తున్నవేళ, కృత్రిమ మేధ సమాజ డైనమిక్స్ను సంపూర్ణంగా మారుస్తున్న తరుణంలో, భూగోళంలోని వివిధ సమాజాల రూపురేఖలు గణనీయంగా మారిన – మారుతున్న సందర్భంలో తెలంగాణ పేద సాదలకు ఆ చైతన్యం, ఆ జ్ఞాన బలిమి, విశ్లేషణ పటిమ, నైపుణ్య ప్రతిభ, ముందుచూపు అందించడం ముఖ్యం. ఎందుకంటే వారి భవిష్యత్ తరాలకు అదే కేంద్రకం కానున్నది కాబట్టి. అదే అందరిని శాసించనున్నది కాబట్టి. అదో అలాంటి కీలక – అత్యంత ప్రధానమైన జ్ఞాన దీపికను వదిలేసి ఇంకా గద్దర్పేర రక్తపాత విప్లవాలు – అందుకు ఉసిగొలిపే పాటలు – ఆటలు – అడవి దారుల గూర్చి కలవరించడం పూర్తిగా అమాయకత్వం తప్ప మరొకటి కాదు. ఆ రకమైన ఆలోచనలకు కాలం చెల్లింది. ఆ మార్పును పసిగట్టకపోతే వెనకబడేది మనమేనన్న స్పృహ అందరిలో ఉండాలి.
సమాజంలో మార్పుకోరే గద్దర్ అభిమానులు – ఆరాధకులు ఇటువైపు దృష్టి సారిస్తే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది…. అందుకు రాళ్ళెత్తిన కూలీలందరు ధన్యులు.
-వుప్పల నరసింహం సీనియర్ జర్నలిస్టు
9985781799