– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేరే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మండలం, పోతవరం గ్రామంలో శనివారం’మన ఇల్లు – మన గౌరవం’ కార్యక్రమం జరిగింది. ఈ ఆమె పాల్గొని, మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్ప పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అందుకే ప్రతి పేదవాని ఇంటి కల నెరవేరాలన్న కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కసరత్తు చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి, లబ్ధిదారుల ఇబ్బందులను గుర్తించి ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో తామంతా ఒక ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ఇల్లు నిర్మించుకునేవారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2025 గడువులోపు రాయితీ రుణాన్ని అందుకోవాలని డాక్టర్ లక్ష్మి కోరారు. ఏదైనా అధికారుల నుండి కానీ, ఇళ్ల నిర్మాణానికి అవరోధాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. అధికారులు కూడా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుల పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించి, ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇంటి కల నెరవేర్చేందుకు సహకరించాలని కోరారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేక అద్భుతాలను ప్రజలకు అందించిందని ఆమె వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం నిరంతరం తపిస్తూ వరద బీభత్సంలో పేదలను ఆదుకునేందుకు ఎలా కృషి చేశారో మీరందరూ చూశారన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ప్రతి ఒక్క పేదవాని ఇంటిలో వెలుగులు నింపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరం కలిసికట్టుగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, హోసింగ్ డీఈ, ఏఈ, సచివాలయ సిబ్బంది, తదితర అధికారులు పాల్గొన్నారు.