పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు :పొన్నూరులో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాల అవినీతికి కారకులు ఎవరని పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. శనివారం కారంపూడి నియోజకవర్గంలోని వట్టిచేరుకూరులో క్లస్టర్, యూనిట్ ఇంచార్జులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు డా. పెమ్మసాని ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నేళ్లు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు భరించినా జెండా వదలని కార్యకర్తలు మరో 50 రోజులు ఓపిక పట్టాలని ఆయన కోరారు. అందుబాటులో లేని ఓటర్లను బూత్‌కు తీసుకెళ్లి మరీ ఓట్లు వేయించే బాధ్యత మన ఇంచార్జుల పైనే ఉందని ఆయన తెలిపారు. లేకుంటే దొంగ ఓట్లు పడే ప్రమాదం ఉందన్నారు. అలాంటి దొంగ ఓట్ల కారణంగానే గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓడిపోవాల్సి వచ్చిందని బూర్ల పేర్కొన్నారు. ఈసారి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కర్త వందనా దేవి, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జి కొర్రపాటి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.