– సంపద సృష్టికి ఏది ప్రణాళిక?
– సూపర్ సిక్స్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి…
– రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై ప్రజలు ఆక్షేపణ…
– మాజీ ఎమ్మెల్యే డీవై దాస్
ప్రజలు అడగకుండానే ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ఎన్డీయే కూటమి పార్టీలు.. అధికారంలోకి వచ్చాక అదనపు భారాలు మోపేందుకు సిద్ధమయ్యాయనే విమర్శ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పామర్రు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డివై దాస్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలకు సంపద సృష్టిస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రణాళిక రూపకల్పనకు తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ అమలు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. దీనిపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అమలు చేయడానికి రాష్ట్ర సంపదను, సమయాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అందుకు భిన్నంగా పాలన చేస్తారనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి అవకాశం ఇచ్చారన్నారు. ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధికి నేటి పాలనలో అడుగులు పడడం లేదన్నారు. ప్రజలు అడగకుండానే హామీలు గుప్పించడంతో వాటిని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములా పరిణమించిందన్నారు. దీంతో ప్రజలపై అదనపు భారాలు మోపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు.
అందుకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ ఆలోచన దర్శనమిస్తుందన్నారు. దానిలో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో సైతం రోడ్ల నిర్మాణానికి టోల్గేట్ ఏర్పాటు చేయాలనే తలంపు ఇందుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను చవి చూడడం ఖాయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అమలు చేయడం కోసం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. అంతకు ముందు పని చేసిన టీడీపీ ప్రభుత్వం ఇదే బాటలో పయనించిందన్నారు. ఆ అనుభవాలను పరిగణలోకి తీసుకోకుండా అదే తరహాలో హామీలు ఇచ్చిన ఎన్డీయే కూటమి పార్టీలు ఇప్పుడు ప్రజలపై అదనపు భారాలకు సిద్ధమయ్యారని అన్నారు.