పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో చోటు
రాజకీయ ప్రవేశంతోనే సంచలనం
గుంటూరు: రాజకీయ ప్రవేశంతో సంచలన విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి వర్గంలోకి చోటు సంపాదించుకుని చరిత్ర సృష్టించా రు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో నాడు కేంద్ర మంత్రిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. అయితే యాదృచ్చికంగా ఆయన అల్లుడు కిలారి రోశయ్యపైనే పెమ్మసాని విజయకేతనం ఎగురవేశారు. అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. భారతదేశంలో ధనవంతుడైన ఎంపీగా పేరొందిన పెమ్మసాని మన గుంటూరు ఘాటు మిరప గళాన్ని పార్లమెంటులో వినిపించనున్నారు. చంద్రబాబుకు ఎవరిపైనైనా నమ్మకం కావాలంటే చాలా కష్టపడాలి. కానీ, అవేమీ పెమ్మసానికి అవసరం లేకుండానే తొలి విజయంతో అధినేత మనసుతో పాటు మంత్రి పదవి దక్కించుకోవటం విశేషం. చిన్నబాబు విజయంలో పాలుపంచుకోవటంతో పాటు అధినేత ఆశీస్సు లతో సంపదలోనే కాదు…పదవులలో కూడా తొలి వరసలోనే ఉండటంతో ఆయన సొంత నియోజకవర్గం తెనాలి బుర్రిపాలెంలో హర్షాతిరేకాలు పెల్లుబుకుతున్నాయి. ఆయన సహకారంతో రాష్ట్రంలో ఏ రంగంలో ముందుకు సాగుతుందో చూడాలని అప్పుడే ఆసక్తికర చర్చ జరుగుతోంది.