వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజం
పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: నమ్మి ఓటేసిన పేదలను వైసీపీ అభ్యర్థి బొల్లా నట్టేట ముంచారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ము చూసుకుని విర్రవీగుతున్న బొల్లా కొమ్ములు వంచాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని పిలుపునిచ్చారు. వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో ఫిష్ మార్కెట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం సోమవారం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మె ల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తమ హయాంలో వినుకొండకు తాగునీటి పథకం, గ్రామ గ్రామానికి సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని పల్నాడు వాటర్ గ్రిడ్ కోసం రూ.640 కోట్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. వినుకొండ పట్టణ శాశ్వత తాగునీటి పథకం కోసం రూ.159 కోట్లు తెచ్చామన్నారు. కానీ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తప్ప మరేం పట్టని ఎమ్మెల్యే బొల్లా వాటిని పూర్తి చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మత్స్యకారు లకు వలలు, బైకులు, ఐస్ బాక్సులు, సోలార్ విద్యుత్ దీపాలను ఇచ్చామని గుర్తు చేశారు. వారికి అన్ని వసతులు కల్పించి వేట లేనప్పుడు సాయం అందేలా చూస్తానని భరోసా కల్పిం చారు. ప్రభుత్వం రాగానే ఐడీ కార్డులు కూడా ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ వరికపూడిశెల ప్రాజెక్టుకు అనుమతులు, రైల్వే అండర్ పాస్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన శ్రీకృష్ణదేవరాయలుకు అండగా ఉండాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.