ఐదు వేల కోట్ల ఎన్ సీసీ ప్రాజెక్టుకు జీవీఎంసీ సాయికాంత్ వర్మ అక్రమ అనుమతులు

-కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా విజయసాయి, కేఎన్ ఆర్ లదే జీవీఎంసీలో హవా
-మాజీ ప్రిన్పిపల్ కార్యదర్శి ఎర్రా శ్రీలక్ష్మీ సిఫార్సుతో షార్ట్ ఫాల్ ను పక్కన పెట్టి డీమ్డ్ అప్రూవల్
-అక్రమంగా వందల కోట్ల టీ డీ ఆర్ కు రంగం సిద్ధం
-17 కోట్ల జీవీఎంసీ నిధులతో లే అవుట్ లో రహదారులకు టెండర్
-నాలా,వి ఎల్ టీ వసూలు చేయకుండా,కొండపోరంబోకు భూమికి అనుమతులు
-జనసేన నేత పీతల మూర్తి యాదవ్  

విశాఖపట్నం, మహానాడు : మహా విశాఖ నగర పాలక సంస్ధ ( జీవీఎంసీ ) కమిషనర్ సాయి కాంత్ వర్మ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ ల ఒత్తిడికి లొంగి వందల కోట్ల మహా పాపానికి ఒడిగట్టారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ మధురవాడలోని అత్యంత వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఎన్ సీసీ భూములను అధికార దుర్వినియోగంతో చేజిక్కించుకున్న విజయసాయి రెడ్డి బినామీ అయిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళీ, కే ఎన్ ఆర్ బినామీలకు నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ విల్లాల నిర్మాణానికి తన చేతికి మట్టి అంటకుండా డీమ్డ్ అప్రూవల్ వచ్చేట్టు వ్యవహరించారని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

షార్ట్ ఫాల్ గా ఉన్నా కమిషనర్ ఆమోదం
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల కోసం చేసిన దరఖాస్తును పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారులు  ల్యాంగ్ ఎలియనేషన్ వివరాలు అందజేయాలని, రెవిన్యూ రికార్డులలో మార్పులు చేయాలని,రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కు గిఫ్ట్ డీడ్ చేయాలని, నాళా, వీఎల్ టీ చెల్లింపులు జరపాలని,ఆ స్థలంలో ఉన్న నీటి కుంటల వివరాలు సమర్పించాలని షార్ట్ ఫాల్ గా పేర్కొన్నారు. ఈ వివరాలు అందజేసిన తరువాతే ప్లాన్ కు ఆమోదం తెలపాలని స్పష్టంగా పేర్కొంటూ కమిషనర్ సాయి కాంత్ వర్మ లాగిన్ కు ఫైల్ ను పంపించారు. నిబంధనల ప్రకారం వెంటనే ఈ వివరాలు సమర్పించేంత వరకూ స్ధలంలో పనులు ఆపాలని అదేశించాల్సిన కమిషనర్ అందుకు విరుద్ధంగా రెండు నెలలకు పైగా తన లాగిన్ లోనే ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంచేశారు. ఏప్రిల్ 24 వ తేదీన ఆ ఫైల్ కమిషనర్ లాగిన్ కు వస్తే ఇప్పటి వరకూ దానిపై ఆయన అవును అని కానీ కాదు అని కానీ చెప్పలేదు.వంద  ఎకరాల అత్యంత కీలకమైన ఫైలుపై ఆయన  ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో 15 రోజుల తరువాత దానిని అనుమతించినట్లు భావిస్తారు.ఆ రకంగానే ఎన్ సీ సీ భూములకు సాయి కాంత్ వర్మ వైసీపీ పెద్దల కోసం సహకరించారు అని మూర్తి యాదవ్ ఆరోపించారు.

ఆరు వందల కోట్ల టీడీఆర్ కు స్కెచ్
అక్రమంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ సీ సీ భూముల్లో 43,500 గజాల స్థలం రహదారులకు పోయిందని రహదారి అభివృద్ధి ప్లాన్ ( ఆర్ డీ పీ) లో నిర్ధారించి అందుకు నాలుగు రెట్లు అంటే 600 కోట్ల రూపాయల టీ డీ ఆర్ బాండ్ లు ఇవ్వడానికి సాయి కాంత్ వర్మ రంగం సిద్ధం చేశారని మూర్తి యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ భూమిని 150 కోట్ల రూపాయలకు అప్పట్లో షేరింగ్ ప్రాతిపదికన ఏ పీ హౌసింగ్ బోర్డు ద్వారా విక్రయిస్తే జీవీఎంసీ అదే భూమికి 600 కోట్ల రూపాయల టీ డీ ఆర్ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. నిబంధనల మేరకు ఏ ప్రైవేటు భూమిలో అయిన లే అవుట్ అనుమతులు తీసుకోవాలంటూ అందులో 45 శాతం భూమి రహదారులు, పార్కులకు  వదిలేస్తారని, విచిత్రంగా అలా వదిలిన భూమికి సాయి కాంత్ వర్మ టీడీఆర్ ఇవ్వాలనుకోవడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.

17 కోట్ల జీవీఎంసీ నిధులతో రహదారుల
ప్రైవేటు వ్యక్తులు బడా బాబుల కోసం నిర్మించే విల్లాల ప్రాజెక్టుకు 17 కోట్ల రూపాయలు ప్రజలు పన్నుల రూపంలో జీవీఎంసీకి చెల్లించిన మొత్తంతో రహదారులు నిర్మించేందుకు అన్ని దశల్లో ఆమోదం తెలిసి టెండర్ పిలిచారంటే దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విశాఖ నగరంలో లక్షల మంది ప్రజలు, విలీన గ్రామాల ప్రజలు సరైన రహదారులు లేక అల్లాడిపోతుండే, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటే స్పందించని కమిషనర్ సాయి కాంత్ వర్మ నగర శివారులోని విల్లాలపై ఇంత ప్రేమ చూపడం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం గతంలో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన ఐ ఏ ఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మీ ప్రత్యేకంగా జీ వో కూడా ఇచ్చారని చెప్పారు.

అనుమతులు రద్దు చేయాలి
వేల కోట్ల కుంభకోణంగా మారిన ఎన్ సీ సీ భూముల్లో ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులను రద్దు చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. సాయి కాంత్ వర్మ ఇచ్చిన నిర్మాణ అనుమతులను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రుషికొండ ఐటీ టవర్స్  పక్కనే ఉన్న ఈ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఐ టీ పరిశ్రమ విస్తరణకు వినియోగించాలని కోరారు.

ఈ డీ, సీ బీ ఐ విచారణ
ఈ భూ కుంభకోణానికి పాల్పడిన విజయసాయిరెడ్డి, కే నాగేశ్వర రెడ్డి, సింగపూర్ రమణా రెడ్డి, కొట్టు మురళీ తదితరుల వ్యవహారాలపై ఈ డీ సీ బీ ఐ సంస్ధలతో విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ భూముల కేంద్రంగా పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ జరిగిందని, ఈ భూములకు ఫైనాన్స్ చేసిన యాక్సిస్ ఫైనాన్స్ సంస్థ పై విచారణ జరపాలని కోరారు. తెలుగుదేశం కార్పోరేటర్లు నొల్లి నూకరత్నం,గొలగాని మంగ వేణి, జోనల్ కో ఆర్డినేటర్ భైరెడ్డి పోతన్న రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు