రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు

– మంత్రి సవిత

విజయవాడ, మహానాడు: చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత తెలిపారు. విజయవాడ నగరంలోని పీవీపీ స్క్వేర్ మాల్ లో ఏర్పాటుచేసిన హాండ్ల్యూమ్ బజార్ ను శనివారం ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చేనేత కార్మికులకు, పరిశ్రమ అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.

ప్రస్తుత మార్పులకనుగుణంగా, ట్రెండ్ కు తగ్గట్లుగా చేనేత దుస్తుల తయారీలో డిజైన్లను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నూతన డిజైన్లు రూపొందిస్తున్నామన్నారు. ఈ డిజైన్లను చేనేత వస్త్రాల తయారీలో వినియోగించేలా నేతన్నలకు శిక్షణిస్తున్నామన్నారు. చేనేత వస్త్రాల తయారీలో నేచురల్ కలర్స్ వినియోగంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవలం డిజైన్లు రూపొందించడమే కాకుండా నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అంతిమంగా చేనేతలకు మేలు చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు ప్రధాన లక్ష్యమన్నారు.

చీరను కొనుగోలు చేసిన మంత్రి
అంతకుముందు మంత్రి సవిత…హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి… ఎక్కడి నుంచి వచ్చారు… అమ్మకాలు సాగుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఏపీతో పాటు బెంగుళూరు, చెన్నై, బికనీర్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ స్టాల్ వద్ద ఆభరణాలను పరిశీలించారు. ఏ మెటీరియల్ తో తయారు చేశారో అక్కడి ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించడంలో భాగంగా ఓ స్టాల్ వద్ద చేనేత చీరను మంత్రి సవిత కొనుగోలు చేశారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి కూడా చీరలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ప్రతినిధులు రంజన, సుజాత తదితరులు పాల్గొన్నారు.