హ‌ర్ ఘ‌ర్ తిరంగ్ జాతీయ సమైక్య‌త‌ను చాటి చెబుతుంది

  • డూండీ గ‌ణేష్ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో భారీ తిరంగ ర్యాలీ
  • జాతీయ జెండా చేతబూని న‌డిచిన ఎంపి కేశినేని శివ‌నాథ్
  • ర్యాలీలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి
  • వేలాదిగా హాజ‌రైన విద్యార్ధులు, న‌గ‌ర వాసులు
  • లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ లో ప్రారంభం, పంజా సెంట‌ర్ లో ముగింపు
  • ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గంలో రెప‌రెప‌లాడిన మువ్వన్నెల జెండా

విజ‌య‌వాడ : దేశ ప్రజల్లో జాతీయ సమైక్యత, జాతీయ భావం, దేశభ‌క్తి పెంపొందేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన హ‌ర్ ఘ‌ర్ తిరంగ్ కార్యక్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు.

డూండీ గ‌ణేష్ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 3,303 అడుగుల భారీ తిరంగా జెండా ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిధిగా ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితో క‌లిసి పాల్గొన్నారు.

ఈ ర్యాలీ లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ నుంచి ప్రారంభ‌మై సితార సెంట‌ర్, చిట్టిన‌గ‌ర్, కె.బి.ఎన్ కాలేజీ మీదుగా పంజా సెంట‌ర్ వ‌ర‌కు సాగింది. ముందుగా ఎంపి కేశినేని శివ‌నాథ్ లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ లో విద్యార్ధుల ప‌ట్టుకున్న భారీ తిరంగా జెండాను ప‌రిశీలించారు. అనంత‌రం ర్యాలీ ముందు జాతీయ జెండా చేత‌బూని ర్యాలీని ముందుకి న‌డిపించారు.

పంజా సెంట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడారు. భారతదేశ పార్లమెంటు సభ్యుడిగా మీ అందరితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కులా మ‌తాల‌కు అతీతంగా వుండే ప‌శ్చిమ నియోజ‌వ‌క‌ర్గంలో దేశ స‌మైక్య‌త‌ను పెంచే విధంగా జ‌రిగిన ఈ ర్యాలీ స్వాతంత్యోద్య‌మంలో ప్రాణాలు ఆర్పించిన వీరుల స్పూర్తిని నేటి త‌రానికి అందించింద‌న్నారు.

2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి పిలుపు ఇవ్వ‌టం జ‌రిగింద‌న్నారు. ప్రధాన మంత్రి మోదీ పిలుపుతో ప్రతి ఇంట జాతీయ జెండా రెపరెపలాడుతుందని. నేటి యువతరం లో జాతీయభావం బాగా పెరిగిందన్నారు.. హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, స్వాతంత్య్రోద్యమ చరిత్ర ఈ తరానికి చాటి చెప్పటంతో పాటు స్వాతంత్య్ర సమర వీరుల పోరాట స్పూర్తిని అందిస్తుందన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతదేశ ప్రజలందరూ గర్వపడేలా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా కి రూపకల్పన చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య ఉమ్మడి కృష్ణజిల్లా ముద్దు బిడ్డ కావటం మనకు ఎంతో గర్వకారణమ‌న్నారు.. నాడు పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతదేశానికి ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా ప్రకటించింది విజయవాడలోనే అని గుర్తు చేసి ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధుల్లో ఉత్సాహ‌న్ని నింపారు.

ఎంపి కేశినేని శివ‌నాథ్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌, రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు డూండీ రాకేష్ , బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు అడ్డూరి శ్రీరామ్, టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా, ఎమ్.ఎస్ .బేగ్, గ‌న్నే ప్ర‌సాద్, మాదిగాని గురునాథం, మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి మ‌హ్మాద్ ఫ‌తాఉల్లాహ్, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, విజ‌య‌వాడ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు గ‌డ్డం ర‌వి, డూండీ గ‌ణేష్ సేవ స‌మితి నిర్వాహ‌కులు ద‌ర్శి సుబ్బారావు, కొత్త ముక్తేశ్వ‌ర‌రావు, కె.డి శ్రీను ఇత్త‌డి చార్లెస్, పేరాబ‌త్తుల ర‌మ‌ణ‌, కార్పొరేట‌ర్ ఉమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర్లు న‌డిచారు. వీరి వెనుక వివిధ విద్యా సంస్థ‌లు, కాలేజీల నుంచి త‌ర‌లివ‌చ్చిన‌ వేలాది మంది విద్యార్ధులు 3,303 అడుగుల భారీ తిరంగా జెండాను చేత‌బూని వందేమాతరం అంటూ న‌డిచారు.