యానిమేటర్లు, ఆర్పీలపై వేధింపులు ఆపాలి

-కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన 
-ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులను మార్చడం సరికాదు 
– యూనియన్ నాయకులు దండా లక్ష్మీనారాయణ   

గుంటూరు, మహానాడు: యానిమేటర్లు, ఆర్పీలపై రాజకీయ వేధింపుల ఆపాలని కోరుతూ పెద్ద సంఖ్యలో ఆర్పీలు, యానిమేటర్లు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యానిమేటర్లు, ఆర్పీలపై తక్షణమే రాజకీయ వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేసింది ఆర్పీలను యానిమేటర్లను తొలగించడానికి కాదని హితవు పలికారు. రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలకు ఓసారి పార్టీలు మారుతుంటారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఆర్పీలు, యానిమేటర్ల పై రాజకీయ ముద్రలు వేయడం సరికాదన్నారు. వేధింపులు ఆపకపోతే బహిరంగ ఆందోళనకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎన్నికల్లో గెలిపించి నా ఆత్మగౌరవాన్ని పెంపొందించారు, అందుకు కృతజ్ఞతగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పి, రోజులు కూడా గడవకముందే గ్రామాల్లో, పట్టణాల్లో చిరుద్యోగులపై చోటా నాయకులు ప్రతాపం చూపటం సరికాదన్నారు. దానికి అధికారులు కూడా వంత పాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

ఆర్పీల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అచ్చమాంబ మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆర్పీలపై వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు దేబోర మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో ఈ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వాలిగానీ, ఉన్నవాళ్ళని తీసేసి మా పార్టీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో రాజకీయ నాయకులు ఆలోచించాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు రమాదేవి, విజయలక్ష్మి, శివకుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు.