ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే

లండన్ వెళ్లాలన్న దృష్టి తప్ప ప్రజలను పట్టించుకుందామని ధ్యాస లేదు
విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు
ప్రజల రక్షణకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు
ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే
ఇప్పటికే విజయవాడ నగర 32 వార్డుల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం
లక్షకుపైగా మెడికల్ కిట్లు పంపిణీ చేశాం.. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా పంపిణీ
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది. దార్శనికత, ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధ కలిగిన నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం. ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరుకు గండ్లు ఏర్పడ్డాయి.

భారీ వర్షాలు, వరద ధాటికి 32 వార్డు సచివాలయాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కలెక్టరేట్ నే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్యశాఖ కూడా మరింత అప్రమత్తమైంది. 32 వార్డు సచివాలయాల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం. ఆరు రకాల మందులతో కూడిన లక్షకు పైగా మెడికల్ కిట్లను ఇప్పటికే పంపిణీ చేశాం. రానున్న రోజుల్లో ఈ మెడికల్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తాం.

ఎల్లుండి నుంచి మూడు రోజులపాటు డోర్ టు డోర్ మెడికల్ సర్వే నిర్వహిస్తాం. ప్రతి సచివాలయానికి సి.హెచ్.ఓ వారికి అనుబంధంగా ఏఎన్ఎం సిబ్బంది పని చేస్తారు.. వీరికి శిక్షణ కూడా ఇస్తాం. మెడికల్ క్యాంపుల్లో 71 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటివరకు 6వేల ఓపి సర్వీసులు వచ్చాయి.. 2900 విష జ్వరాలకు సంబంధించి, 900 డయేరియా కేసులు, 6000 శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చాయి. అత్యవసర వైద్య సాయం అందించేందుకు వెయ్యి మంది ఆరోగ్య సిబ్బంది పని చేస్తున్నారు. డోర్ టు డోర్ డిసీస్ సర్వే నిర్వహిస్తారు.. వ్యాధుల పై అవగాహన కల్పిస్తారు.దోమలు ప్రబలే అవకాశం ఉండడంతో దోమకాటును నివారించేందుకు కేంద్రంతో మాట్లాడి ఇన్సెక్ట్ నెట్స్ అందిస్తాం.

త్వరితగతిన వరద నివారణ చర్యలు చేపడుతున్నాం.వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు ఫాగింగ్ స్ప్రే చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష నిర్వహించారు.

కొందరు బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్నారు.గత ప్రభుత్వం ఐదేళ్లలో నిర్లక్ష్యం చేసిన కారణంగా నేడు ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని వాళ్ళు పూర్తిగా విస్మరించారు. బుడమేరకు సంబంధించి ఎటువంటి నిర్వహణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ముంపు తలెత్తింది. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వ నాయకుడికి పాస్ పోర్ట్ తీసుకుని లండన్ వెళ్లాలన్న దృష్టి తప్ప ప్రజలను పట్టించుకుందామని ధ్యాస లేదు.

ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు.. మునిగిపోయిన ఇళ్లనే కాదు మునిగిపోయిన జీవితాలను కూడా బాగు చేయాలని ఆలోచిస్తోంది.దెబ్బతిన్న వ్యాపారాలను నిలబెట్టాలన్న ఉద్దేశంతో వారికి బ్యాంకుల ద్వారా లోన్లు మంజూరు చేసే అంశంపై ఆలోచిస్తున్నాం.

బుడమేరుపై కేంద్రం కూడా దృష్టి సారించి ఆర్మీ ని పంపింది. యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి.రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గండ్లు పూడుస్తున్నారు.మంత్రి లోకేష్ ఈ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిలుగా నియమించి నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉంది.ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోంది.