-వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు
-ఉదయం నుంచే ఉక్కపోత
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారత దేశం వేడిగాలులతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) శుక్రవారం ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. మండలంలో నేడు వడగాలులతో పాటు 45.1°C ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మండల వాసులంతా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిన్న విజయవాడ అర్బన్‌లో 43.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది.