భారీ వర్ష సూచన… ప్రభుత్వం అప్రమత్తం

– హోం మంత్రి అనిత

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామని, పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు హోం మంత్రి చెప్పారు.

కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు, గట్లను గుర్తించి పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని, పిడుగులు పడి, వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరామన్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించే చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించామన్నారు.