– నీట మునిగిన ఇళ్ళు
– 11 సబ్‌వేల మూసివేత
– మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు
చెన్నై: భారీ వర్షాలతో పట్టణం అతలాకుతలమవుతోంది. వేలచేరిలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. 11 సబ్ వేలు మూసివేశారు. మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు. 16 వేల మంది వాలంటీర్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతోంది.
చెన్నైకి 440 కిమీ, పుదుచ్చేరికి 460 కిమీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది. వాయుగుండం గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డి. రోణంకి కూర్మనాథ్ చెప్పారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, విశాఖపట్నంలో రెండు రోజులు ఉదయం, రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోందని పలువురు చెబుతున్నారు.