ఇటీవలె టాలీవుడ్‌లో డ్రగ్స్ హంగామా బాగా ఎక్కువయిపోయింది. రీసెంట్‌గా జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో టాలీవుడ్ కి చెందినవారు అనేకమంది ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు, ఫోటోలను పోలీసులు విడుదల చేసింది. అయితే తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని ..హైదరాబాద్ లోనే ఉన్నానంటూ బుకాయించి మరీ వీడియో రిలీజ్ చేసింది మహానటి హేమ. ఆరోజు బర్త్ డే పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికి డ్రగ్స్ టెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే డ్రగ్స్ టెస్ట్‌లో తెలుగు సినీ నటి హేమకు పాజిటీవ్ వచ్చినట్లుగా అధికారులు బయటపెట్టారు. ఇప్పుడు ఈవార్త ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. యాక్టర్ హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు బెంగుళూరు పోలీసులు. మొత్తం 150 మంది రక్తనమూనాలను సేకరించిన పోలీసులు డ్రగ్స్ టెస్ట్‌లో 84 మందికి పైగా వ్యక్తులకు పాజిటీవ్ నిర్ధారణైంది.అయితే ఆరోజు పార్టీకి వెళ్లిన వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. అయితే డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వాళ్లలో మిగతా ప్రముఖుల పేర్లు బయటకు రావాల్సి ఉంది. తనిఖీల్లో ఎండీఎంఏ పిల్స్, కొకైన్, హైడ్రో గాంజా సహా మరికొన్ని మత్తు పదార్థాలు గుర్తించినట్లు తెలిపారు. అయితే పోలీసుల రాకతో డ్రగ్స్‌ను స్విమ్మింగ్ పూల్స్‌లో విసిరేశారని ఈ మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు దేశంలో తొలిసారి డాగ్ స్క్వాడ్ ఉపయోగించామని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని ఇందులో ఇద్దరు సూత్రదారులు, ముగ్గురు పెడ్లర్లు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేయగా 150 మంది హాజరయ్యారని తెలిపారు.