ఇదిగో ఆధారాలు..చర్యలు తీసుకోండి

రాష్ట్రంలో అల్లర్లపై సిట్‌ చీఫ్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
30 ఘటనలపై సాక్ష్యాలతో సహా వీడియో క్లిప్పింగులు
పిన్నెళ్లి సోదరులు, చెవిరెడ్డి`కుమారుడు, పెద్దారెడ్డే కారకులు
విచారించి తక్షణమే వారందరినీ అరెస్టు చేయాలని కోరిన వర్ల
కారకులైన వారిని శిక్షిస్తామని సిట్‌ చీఫ్‌ హామీ ఇచ్చారు
ఆహ్వానించి మరీ ఫిర్యాదు తీసుకున్నారని వెల్లడి

మంగళగిరి, మహానాడు : రాష్ట్రంలో జరిగిన అరాచక ఘటలపై శనివారం సిట్‌ చీఫ్‌ వినిత్‌ బ్రిజ్‌లాల్‌కు టీడీపీ నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, కోడూరి అఖిల ఫిర్యాదు చేశారు. అరాచకాలకు పాల్పడిన పిన్నెళ్లి సోదరులు, చెవిరెడ్డి తండ్రీ కొడుకులు, కేతిరెడ్డి పెద్దారెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, నరసరావుపేట, అనంతపురంలో జరిగిన అరాచకాలపై సాక్ష్యాలతో సహా వీడియో క్లిప్లింగ్‌లను అందజేశారు. అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. 30 ముఖ్యమైన సంఘటనలను, అందుకు కారకులైన వారి వివరాలను ఇచ్చారు. అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం లో మాట్లాడారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. హౌస్‌ అరెస్టులో ఉన్న పిన్నెళ్లి ఎలా పారిపోయాడని అడిగితే సిట్‌ చీఫ్‌ చిరునవ్వు నవ్వాడని.. పిన్నెళ్లితో పోలీసులు మిలాఖత్‌ అయ్యారా? కుమ్మ క్కు అయ్యారా అనేది తప్పకుండా విచారణ చేయిస్తానని, అన్ని ప్రాంతాలకు సిట్‌ టీమ్‌లు వెళ్లాయని పిన్నెళ్లి సోదరులను పట్టుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

సిట్‌ చీఫ్‌ సానుకూలంగా స్పందించారు

రాజేంద్రనాథ్‌రెడ్డి, సవాంగ్‌ ఉన్నప్పుడు టీడీపీ నేతలకు డీజీపీ ఆఫీసులోకి ప్రవేశం లేదని, నేడు స్వేచ్ఛగా డీజీపీ ఆఫీసులోకి వెళ్లినట్లు చెప్పారు. సిట్‌ చీఫ్‌ గౌరవంగా ఆహ్వానించి ఫిర్యాదును స్వీకరించినట్లు వివరించారు. మాచర్లలో పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్‌ను, తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కొడు కు, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని కోరారు. నాటు బాంబు లు, పెట్రోల్‌ బాంబులు తయారు చేసిన వారిని అరెస్టు చేయాలని కోరామన్నా రు. దానికి సిట్‌ చీఫ్‌ సానుకూలంగా స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షి స్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అరాచకానికి జగన్‌ శ్రీకారం చుడితే అరాచ కాన్ని ఎన్నికల కమిషన్‌ ఆపాలని ప్రయత్నించిందని వర్ల అన్నారు. 2019లో డీజీపీని, సీఎస్‌ ను, ఎస్పీలను ఎలక్షన్‌ కమిషన్‌ బదిలీ చేస్తే భేష్‌ అని జగన్‌రెడ్డి మెచ్చుకున్నాడని, నేడు తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటే ఎలక్షన్‌ కమిషన్‌పై దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. చర్యలు తీసుకున్న 12 మంది అధికారుల్లో ఆరుగురు జగన్‌ రెడ్డి సామాజికవర్గం వారేనని తెలిపారు.

కుట్ర వెనుక ఆ నలుగురు అధికారులు

ఓడిపోతున్నామనే తెలిసే నిరాశ నిష్ప్రహతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.. అరాచకానికి శ్రీకారం చుట్టింది వైసీపీ నేతలే. ఈ కుట్ర వెనుక మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, అడిషనల్‌ డీజీ సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ధనుంజయ్‌ రెడ్డిలు ఉన్నారు. ఎన్నికల రోజు వీరి ఫోన్‌కాల్‌ డేటా బయటకు తీస్తే వారి కుట్రలు బయటపడతాయి. దొంగే దొంగ దొంగా అని అరిచినట్లు ఉంది వైసీపీ నేతల తీరు. ఇది పేరుమోసిన దొంగల ముఠా, నేర ప్రవృత్తిలో ఆరితేరిన ముఠా అని ధ్వజమెత్తారు. అరాచకాలపై చర్యలకు సిట్‌ వేయడంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు.