– జాతీయ సైవాగమ సదస్సు తీర్మానం
– రంగరాజన్ కు అర్చక శిరోమణి బిరుదు
హైదరాబాద్: చెరువుగట్టు లోని శ్రీసోమేశ్వర శివజ్ఞానపీఠం, తెలంగాణ ఆదిశైవబ్రాహ్మణ అర్చకసంఘం దేవాదాయ ధర్మాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్రి దినాత్మక శైవాగమ జాతీయ సదస్సు వైభవముగా జరుగుతున్నది. వందల మంది శైవాగమ విద్వాంసుల ప్రవచనములతో పండితుల విశిష్టమైన ఉపన్యాసములతో, అనేకమంది ప్రధాన దేవాలయముల ప్రధానార్చకుల అనుభవముల పాఠములతో శైవాగమ జిజ్ఞాసులు ఉపస్థితులు కాగా, దక్షిణాది రాష్ట్రములగు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రరాష్ట్రముల నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ పండితులు హాజరవుతున్న జాతీయ శైవాగమ సదస్సు పలు తీర్మానాలను చేసింది.
ఆలయాల్లో సంప్రదాయ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ శైవాగమ జాతీయ సదస్సు తీర్మానం… వంశపారంపర్య అర్చకుల బదిలీకి తెలంగాణ దేవాదాయ శాఖ చేపట్టిన చర్యపై దేశవ్యాప్తంగా ఉన్న పండితులు హాజరైన జాతీయ సదస్సు విమర్శించింది. అర్చకుడు మరియు దేవాలయంలోని దైవానికి ఉన్న బంధం విడదీయరానిదని స్పష్టంగా నిర్దేశించిన వివిధ ఆగమాలను సమావేశం ప్రస్తావించింది.
అర్చక కుటుంబంలోని తరాలు దేవతతో ఆధ్యాత్మిక బంధంలో ఉన్నాయి. 2007 లో సవరించబడిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి అమలకు వచ్చేసిందని ఈ చట్టం తెలంగాణలో ఇంకా అమలుపరచబడలేదని సమావేశంలో పండితులు వాపోయారు.
ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై మాట్లాడిన చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ ..ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వంశపారంపర్య అర్చకుల పట్ల సానుకూలంగా ఉందని త్వరలో శుభవార్త వస్తుందని హామీ ఇచ్చారు.
సవరణ చట్టాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హామీ ఇచ్చారని రంగరాజన్ గుర్తు చేశారు. సమాజానికి శ్రేయస్సు కలిగే విధంగా అర్చక లోకానికి ఎన్నో ఉపకారాలు చేస్తున్న రంగరాజన్ ని అర్చక శిరోమణి బిరుదుతో సదస్సు సన్మానించింది