350కి పైగా కేసుల విచారణ
ముగ్గురు న్యాయమూర్తుల రికార్డ్
హైదరాబాద్: వేసవి సెలవుల సందర్భంగా తెలంగాణ హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది. సెలవుల కారణంగా ఫైలింగ్‌తో పాటు లంచ్ మోషన్ పిటిషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటన్నింటిపై విచారించడానికి అర్ధరాత్రి దాటింది. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి అర్ధరాత్రి సుమారు ఒంటిగంట వరకు బెంచ్‌పై కేసులు విచారిస్తూనే ఉన్నారు. అంతకుముందు జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డివిజన్ బెంచ్, సింగిల్‌గా జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సుమారు 200కు పైగా కేసుల విచారణ చేపట్టారు. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌లోనే అర్ధరాత్రి ఒంటిగంట దాకా కేసుల విచారణ జరిగింది. జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్‌కుమార్‌లు రాత్రి 11 గంటల దాకా కోర్టులోనే విధులు నిర్వహించారు. ముగ్గురు న్యాయమూర్తులు 350కి పైగా కేసుల విచారణ చేపట్టగా అందులో 60 నుంచి 70 దాకా పరిష్కారమ య్యాయి. గురువారం విచారించిన కేసుల్లో జారీచేసిన ఉత్తర్వులన్నింటిపై న్యాయమూర్తులు శుక్రవారం సంతకాలు చేశారు.