• పెండింగ్ బిల్లుల కోసం పలువురు విన్నపం
• నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంత్రికి అభ్యర్థన
• అర్జీలు స్వీకరించిన మంత్రి అచ్చెన్న, ఏపీహెచ్‌సీ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు
మంగళగిరి, మహానాడు: తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నలుమూలల నుండి అర్జీదారులు ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి మంగళవారం పోటెత్తారు. అర్జీదారుల నుండి మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీహెచ్‌సీ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలు స్వీకరించిన నేతలు వెంటనే సమస్యల పరిష్కారానికి అయా అధికారులతో ఫొన్లలో మాట్లాడి చర్యలకు ఆదేశించారు. అనంతరం వారి చేతుల మీదుగా ఓ దివ్యాంగుడికి వీల్ చైర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు రమణ, తదితరులు పాల్గొన్నారు.
• వీఆర్వోగా ఉన్న జాన్సన్ ప్రదీప్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి.. సబ్ డివిజన్ జరిగినట్టు నకిలీ ఫైళ్లను సృష్టించి తమ భూమిని కొట్టేసేందుకు యత్నించారని.. అలాగే పోలీసులను తీసుకు వచ్చి బెదిరించారని.. అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం బి. కొత్తకోట గ్రామానికి చెందిన సొట్టా నరసింహులు విజ్ఞప్తి చేశారు.
• వైసీపీ ప్రభుత్వంలో చంద్రశేఖరపురం మండలం ఆరివేముల సచివాలయంలో గ్రామ పశువైద్య సహాయకునిగా నియామకమై వైసీపీ నాయకుడు ప్రభుత్వ విధులను నిర్వహించకుండా సొంత పనులు చేసుకుంటూ.. చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారని.. అతని చర్యలపై విచారించి అతన్ని ఉద్యోగం నుండి తొలగించాలని చంద్రశేఖరపురం పెద్దరాజుపాలెం గ్రామానికి చెందిన పలువురు కోరారు.
• తమ భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు అధికారుతో కుట్ర పన్ని.. జగనన్న రీసర్వేలో భాగంగా వాస్తవంగా ఉండాల్సిన భూమిని తగ్గించి ఆన్ లైన్ చేశారని దాన్ని సరిచేసి తమ భూమిని తమకు ఉండేలా చూడాలని అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కుంచంగి గ్రామానికి చెందిన నాగులాపల్లి గణేష్ అనే వ్యక్తి విజ్ఞప్తి చేశారు.
• అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన జి.రాములమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూములకు తొంగ పాస్ పుస్తకాలు పుట్టించి భూమికి హక్కుదారులమైన మమ్మల్ని భూమిలోకి వెళ్లకుండా వై. గంగిరెడ్డి అనే వ్యక్తి బెదిరిస్తున్నారని అతని నుండి భూమిని విడిపించి న్యాయంచేసి అతని వద్ద దొంగపుస్తకాలను రద్దు చేయాలని కోరారు.
• ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధికై కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా రీలింగు అండ్ ట్విస్టింగు యూనిట్స్ ఏర్పాటుకు కేటాయిస్తున్న స్తలాలను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయిస్తున్నారని.. దాన్ని అడ్డుకొని అర్హులకు కేటాయించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన జి.పునిత్ కుమార్ కోరారు.
• టి.నరసాపురం ఫార్మసీ అగ్రికల్చర్ కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీలోని పలువురు సభ్యులు, డిపాజిటర్లు విజ్ఞప్తి చేస్తూ.. సొసైటీకి సీఈఓగా ఉన్న టి. కిసోర్ కుమార్ మరికొంత మంది సిబ్బంది కలిసి సొసైటీ నిధులను దుర్వినియోగం చేశారని దీనిపై విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు.
• అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన ఆదర్శ ఉమెన్ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఏ. మేరి విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ ప్రభుత్వంలో కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ (సి.బి.సి) కార్యక్రమం నిర్వహించినందుకు తమకు రావాల్సిన రూ. 76,20,532 లు ఇంకా రాలేదని.. వాటిని విడుదల చేసి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్ల గ్రామానికి చెందిన పులిగోర్ల నాగరత్తమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమికి దొంగపట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నారని.. ఆక్రమణదారులు నుండి తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పొరుగు సేవల విధానంలో పనిచేయుచున్న వర్క్ ఇన్సెక్టర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐటీ మేనేజర్లు, సహాయ ఇంజనీర్లు, అటెండర్లు విజ్ఞప్తి చేస్తూ.. ఔట్ సోర్సింగ్ నుండి తమను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి సీనియార్టీ ప్రకారం తమకు రావాల్సిన బెన్ఫిట్స్ ను అందించి న్యాయం చేయాలని కోరారు.
• పాలకులు బేడ(బుడ్గ) జంగం ఎస్సీ కుల సమస్యను త్వరగా పరిష్కరించి తమ జాతికి మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బేడ(బుడ్గ) జంగం కులం సంక్షేమ సేవా సంఘం సభ్యులు సంకుల సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
• యానిమల్ హస్బెండరీ లో ల్యాబ్ టెక్నీషియన్స్ గా తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమకు జీతాలు పెంచి ఆదుకోవాలని పలువురు ఉద్యోగులు మంత్రికి అచ్చెన్నాయుడికి అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రకాశం జిల్లా వాసి గోరంట్ల గోపి విన్నవించుకుంటూ.. పశు వైద్యశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం వలన మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. మరుగుదోడ్లను ఏర్పాటు చేసి ఉద్యోగుల అవస్థలను తీర్చాలని మంత్రికి విన్నవించారు.
• కేజీబీవీలలో ఇంటర్ గ్రూప్ మార్చడం వలన ఉద్యోగాలు కోల్పోయిన పీజీటీలను తిరిగి విధుల్లోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ.. పలువురు బాధితులు మంత్రిని వేడుకున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో తమను భర్తీ చేయాలని అభ్యర్థించారు
• గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాలలోని శుభమ్ మహేశ్వరి కోల్డ్ స్టోరేజి అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులు విజ్ఞప్తి చేస్తూ.. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించేలా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంత్రిని వేడుకున్నారు.