దేవులపల్లి అమర్‌కు ఆ పదవి ఎట్లా ఇచ్చారు?

– నియామకం, ఖర్చులపై దర్యాప్తు చేయాల్సిందే
– గత ఐదు ఏళ్ళల్లో ప్రభుత్వ ప్రకటనల జారీ లో అవకతలు వెలికి తీసి చర్యలు తీసుకోవాలి
– ఏ పి జె యు డిమాండ్

విజయవాడ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, విభజనను సమర్ధించిన దేవులపల్లి అమర్‌కు.. జగన్ సర్కారు జాతీయ మీడియా సలహాదారు పదవి ఇవ్వడం ఇప్పుడు వివాదమవుతోంది. అసలు పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, ఏపీలో సలహాదారు పదవి ఎలా ఇచ్చారో దర్యాప్తు జరపాలంటూ ఏపీ జర్నలిస్టు సంఘాలు కొత్తగా గళం వినిపించడం చర్చనీయాంశమయింది.

అనాది నుండి పత్రికా రంగానికి పట్టుకొమ్మ, జర్నలిజానికి రాజధాని గా ప్రసిద్ధి చెందిన విజయవాడలోను, ఆంధ్రప్రదేశ్ లోను అనేకమంది ఉద్ధండులైన ప్రముఖ జర్నలిస్టులు ఉండగా, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర జర్నలిస్టుల పై విషం కక్కిన, తెలంగాణ పాత్రికేయుడిని అంద్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమించటం, ఆయనకు ముగ్గురు పి ఆర్ ఓ లు వారి సిబ్బంది, ఇతర ఖర్చులు హైదరాబాద్ లో ఉంచి భరించి ఆనాటి ప్రభుత్వం ఏమి సాధించిందో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (ఏ పి జె యు ) ప్రభుత్వాన్ని కోరింది.

గడిచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నుండి అనేక కష్టం నష్టాలకు వోర్చి ప్రచురిస్తున్న చిన్న మధ్యతరహా పత్రికలకు నిధులకొరత పేరుతో, కనీస ప్రకటనలు కూడా ఇవ్వకుండా వేధించారని ఏ పి జె యు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాలే వాసుదేవ నాయుడు, చలాది పూర్ణచంద్ర రావు లు నేడు విజయవాడ లో విడుదల చేసిన పత్రికాప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

వాస్తవానికి రెండు ఊరుపేరు కూడా వినని స్థానికేతర పత్రికలకు సదరు జాతీయ సలహాదారు ఒత్తిడి మేరకు ప్రతినెలా ఒక్కొక్క దానికి 40వేలకు తగ్గకుండాను, అలాగే ప్రతి ప్రత్యేక రోజుల్లోను,నాటి ముఖ్యమంత్రి బటన్ నొక్కే కార్యక్రమం వున్న రోజుల్లో, ఒక్కొక్క దానికి లక్ష నుండి లక్షన్నర రూపాయల విలువైన ప్రకటనలు జారీ చెయ్యటం వలన భారీగా ప్రజాధానం వృధా జరిగిందన్న అధికార వర్గాల సమాచారం మేరకు.. ఈ విషయంలో కూడా ఏసీబీ, లేదా విజిలెన్స్ శాఖలతో దర్యాప్తు జరిపించాలని వారు కోరారు.

ఐదేళ్ల ప్రభుత్వంలో విచ్చల విడిగా సుమారు 850 కోట్లకు పైగా జారీ చేసిన ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి కూడా, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికకు ఉద్దేశ పూర్వకంగా జారీ చెయ్యక పోవటం అధికార దుర్వినియోగమేనని దీనిపై కూడా విచారణకు ఆదేశించాలని వాసుదేవ నాయుడు, పూర్ణచంద్ర రావు లు ప్రభుత్వాన్ని కోరారు.

అసలు ఏ ప్రాతిపదికపై కోట్లాది ప్రభుత్వ ప్రకటనలు కొన్ని పత్రికలకు జారీ చేసి భారీగా ప్రజాధనం వృధా చేశారని వారు ప్రశ్నించారు.మడతవిప్పని కొన్ని దినపత్రికలు కిరాణా షాపులు, హోటల్లు, మసాలా దుకాణాలకి పొట్లాలకోసం క్వింటాల్ కి 4500,5000 కి అమ్మినవి కూడా సర్కులేషన్ క్రిందే పరిగణ లోనికి వస్తుందా అని వారు ప్రశ్నించారు.

వీటి అన్నింటిపై దర్యాప్తు సంస్తతో లోతుగా దర్యాప్తు జరిపించి ప్రజాధనం తిరిగి రాబట్టాలని వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విజ్ఞప్తి చేశారు. ఇకనుండి ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు ఒక్కొక్క సందర్భంలో ఒక ప్రముఖ పేపరుకి నిలిపి వేస్తే, ఆ మొత్తం రాష్ట్రం లోని అన్ని చిన్న మధ్యతరహా పత్రికలకి ప్రకటనలిచ్చి ఆదుకోవచ్చని, అందుకు పెద్ద పత్రికలకు రోస్టర్ పద్దతిలో ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని వాసుదేవ నాయుడు, పూర్ణచంద్ర రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.