ఎవడబ్బ సొమ్మని జగన్‌ రూ.12.85 కోట్లతో కంచె వేశారు?

– ఆ సొమ్మంతా ప్రజలది, ఆ కంచెను వేలం వేయండి
– వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయండి
– సీఎంకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విజ్ఞప్తి

మంగళగిరి, మహానాడు: ఎవడబ్బ సొమ్మని జగన్ రూ.12.85 కోట్లతో ఇంటికి రక్షణ గడ్డర్లు ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ధనం జగన్ వాడుకున్నంత విచ్చలవిడిగా గతంలో ఏ ముఖ్యమంత్రి వాడివుండడు. ఇదొక ప్రజాస్వామ్య పరిపాలన అని మరచి, జగన్ ఐదేళ్లపాటు మోనార్క్ లా వ్యవహరించారు. బిన్ లాడెన్, సద్దాం హుసేన్, అమెరికా అధ్యక్షులు కట్టుకున్నట్టు అభేద్యమైన ఐరన్ గడ్డర్ తో తన ఇంటిని జగన్ కట్టుకోవాల్సిన అవసరమేమొచ్చింది? రూ.12.85 కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టి ఇంటికి రక్షణగా సెక్యూరిటీ గడ్డర్ కట్టుకోవడానికి ఎవరు అనుమతించారో బయటపెట్టాలి, ఏ అధికారి నిర్మించుకోమని రిపోర్టు ఇచ్చారో వెంటనే తెలియాలి.

నక్సలైట్స్, సెటిల్ మెంట్ గ్యాంగ్, రిలీజియస్ గ్రూప్, ఐఎస్ఐ లాంటి ఏ గ్రూప్ నుంచి కూడా థ్రెట్ లేనప్పుడు ఎందుకు ఇంతటి రక్షణ జగన్ ఏర్పాటు చేసుకున్నారో ప్రజలకు చెప్పాలి. మంత్రి లోకేష్ చెప్పినట్టు జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో తిన్నదంతా కక్కిస్తాం. నిమ్మకూరులో ఉన్న బెల్ కంపెనీలో ప్రపంచ దేశాల్లో యుద్దాల్లో ఉపయోగించే ఆయుధాలు తయారు చేస్తారు. వాళ్లకు కూడా ఇంతటి దుర్భేద్యమైన సెక్యుక్యూరిటీ గడ్డర్స్ లేవు. అలాంటప్పుడు జగన్ కు ఎందుకు? అత్యంత విలువైన మణిమాణిక్యాలు జగన్ వద్ద ఏమైనా ఉన్నాయేమో అందుకే ఇంతటి దుర్భేద్యమైన రక్షణ గడ్డర్లను ఏర్పాటు చేసుకున్నారు. జగన్ పెట్టుకున్న సలహాదారులు వల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందేమో ఏ సలహాదారుడైనా చెప్పగలరా?

పేదల సొమ్ముతో రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేటప్పుడు పేదల డబ్బు నాకెందుకు అని జగన్ కు అనిపించలేదెందుకు? దీన్ని బట్టి జగన్ కు పేదల పట్ల ఎంతటి ప్రేముందో అర్థమౌతోంది. దుర్మార్గపు ఆలోచనలతో ఐదేళ్లు పాలించి ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసింది జగనే. రాష్ట్ర సలహాదారులుగా తగనివారిని నియమించుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా? జగన్ మానసపుత్రిక సాక్షిలో పనిచేసినవారికి దోచిపెట్టినదంతా ఇప్పడు కక్కించాలి. పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి ధనం అవసరం కనుక జగన్ సలహాదారులు, సాక్షి ఉద్యోగులు, సెక్యూరిటీకి పెట్టిన ఖర్చు అంతా వసూలు చేయాలి.

జగన్ ఐదేళ్లు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, తానొక రాజని, ఇతని కాలు తీసేయండంటే భటులు కాలు తీసేయడం, తల తీసేయండని చెబితే భటులు తల తీసేయడం, కట్టేసి కొరడాతో కొట్టండని ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ పాస్ చేసినట్లుగా ఆర్డర్లు వేయొచ్చని జగన్ అనుకున్నారని రామయ్య ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్య పరిపాలన చేయాలని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని జగన్ కు తెలియదు. జగన్ చదువుకున్నది కూడా అంతంతమాత్రమే. జగన్ తన పాలనా కాలంలో తన ఇంటికి ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు రహదారిని చంద్రబాబు వచ్చాక ప్రజా రహదారి చేశారు. ఎవరికీ ఆ రహదారిపై నడవడానికి వీల్లేని రోడ్డును నలుగురు నడిచేలా చేశారు. 40 అడుగుల ఎత్తు వరకు ఇనుప కంచె కట్టుకోవాల్సిన అవసరం జగన్ కు ఎందుకొచ్చింది? రాజీవ్ గాంధీ ఇలాంటి కంచె ఏర్పాటు చేసుకొని ఉంటే ఎల్ టీటీ సంస్థ నుంచి రాజీవ్ గాంధీ బయటపడేవారు. ఉగ్రవాదుల నుంచి, టెర్రరిస్టుల నుంచి భయం ఉండే మోడీ, అమిత్ షాలకు కూడా ఇంతటి రక్షణ లేదు. రూ.12. 85 కోట్లతో జగన్ తన ఇంటి చుట్టు ఇనుప కంచె ఏర్పాటు చేసుకోవడం ప్రజా ధనాన్ని వృధా చేయడం కాదా?

కోర్టులకు రెగ్యులర్ గా అటెండ్ అయి వుంటే ఎప్పుడో జైలు జీవితానికే పరిమితమయ్యేవారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుకు వెళ్లలేదు. పదవి పోయి నాలుగు నెలలైనా కోర్టుకు ఎందుకు వెళ్లడంలేదో అర్థం కావడంలేదు. కోర్టులు అతన్ని ఎందుకు పిలవడంలేదో కూడా అనుమానానికి తావిస్తోంది. కోర్టుకు ఆయన అవసరం లేదా? లా తెలిసినవారు ఇందుకు సమాధానం చెప్పాలి. వంశపారంపర్యంగా తాను ఒక రాజులా జగన్ ఊహించుకుంటున్నారు. ప్రజాధనాన్ని ఈ విధంగా వృథా చేయడం కరెక్టు కాదు. జగన్ ఇంటికి ఉన్న కంచెను యాక్షన్ వేసి వచ్చిన ధనాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలి. అంతేకాక

నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఉపయోగించుకున్న ప్రజల డబ్బు జగన్ చే కక్కించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.