Mahanaadu-Logo-PNG-Large

అధిక వడ్డీ పేరుతో వందల కోట్ల మోసం

– ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో భారీ మోసం
– నిందితుడు కమలాకర్ శర్మ అరెస్ట్

హైదరాబాద్ : ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ప్రచారం చేసి, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేశారు. ఈ సంస్థ చైర్మన్ కమలాకర్ శర్మ బాధితుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడు. పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్లను ఇప్పిస్తామని మోసం చేశాడు. మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

దాదాపు నాలుగు వేల మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫౌండేషన్ పేరుతో రూ.500 కోట్లకు పైగా వసూలు చేశాడు. కమలాకర్ చేతిలో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ అంశంపై సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ, కమలాకర్ శర్మను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన ఆస్తులను విక్రయించి, బాధితులకు ఇచ్చే విధంగా చూస్తామన్నారు. బాధితులంతా ఒకే కమ్యూనిటీకి చెందిన వారిగా గుర్తించారు.