హైదరాబాద్ నగరం పెట్టుబడులకు తలమానికం

– మీడియాతో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ నగరం పెట్టుబడులకు తలమానికమని, ఉద్యోగాలు రావాలని, జీవనస్థితిగతులు మారాలని కోరి తెచ్చుకున్న రాష్ట్రం మనదని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం జిహెచ్ఎంసి పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

హైదరాబాద్ నగరంలో వినియోగదారులందరికీ కరెంటు నిరంతరం నాణ్యతతో జరగాలని సమీక్ష సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గాలులు, వారాల మూలంగా, వైర్లు వంగిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సేవల కోసం ఏర్పాటు చేసిన 1912 హెల్ప్ లైన్ కు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. 108 తరహాలో విద్యుత్ సంస్థ హెల్ప్ లైన్ సేవలను విస్తృతం చేస్తామన్నారు. గాలి పీల్చుకోవడం ఒక నిమిషం ఆగిపోతే ఎంత ప్రమాదమో విద్యుత్తు స్తంభిస్తే అంతే ప్రమాదంగా ప్రజలు భావిస్తున్నారని.. మారిన కాలానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది సేవలు పెరగాలని డిప్యూటీ సీఎం తెలిపారు. సిబ్బంది బాగా పనిచేసే ప్రచారం కల్పించుకోవాలి ఇందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి ప్రజల మనసులు తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు.

విద్యుత్ శాఖ సేవా దృక్పథంతో పనిచేస్తుంది.. సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పని చేస్తున్నామనే భావన ఉద్యోగుల్లో ఉండాలి.. ఆ భావన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సిబ్బంది కష్టపడేది వినియోగదారులకు తెలియజేసేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. మాకు బేషజాలు లేవు ఎంత చిన్నవారు సమస్యలు చెప్పిన వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పదోన్నతులు బదిలీలకు సంబంధించిన కార్యాచరణ వెంటనే చేపట్టాలని ఉన్నదా అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేసే క్రమంలో స్థలం సమస్య వస్తోంది.

ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలోనే విద్యుత్ శాఖకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు లేఖ రాస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ సంస్థ హెల్ప్ లైన్ 19 12 కు ఫిర్యాదు రాగానే అధికారులు స్పందించి ఫిర్యాదుదారుకు ఫోన్ చేసి ఇబ్బందిని తొలగిస్తామని సమాచారం ఇస్తే వారికి విద్యుత్ శాఖ పై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి. స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులను పాజిటివ్ గా తీసుకొని పరిష్కరించాలి వారు కొన్ని వేలు, లక్షల మందికి ప్రతినిధులు అన్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని తెలిపారు.

అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు. వారు నాణ్యమైన విద్యుత్తు, లా అండ్ ఆర్డర్, మంచినీటి వసతి అడుగుతున్నారు. హైదరాబాద్ కు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, జీవితం హాయిగా ఉంటుందన్న భావన ఏర్పడాలన్నారు. నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయం అందిస్తే పరిశ్రమలు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జిడిపి పెరుగుతుంది అన్నారు. ఉద్యోగాలు రావాలని, జీవనస్థితిగతులు మారాలని, ప్రపంచంతో పోటీ పడాలని బాధ, ఆవేదనతో కోరి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అన్న విషయాన్ని విద్యుత్ సిబ్బంది గమనంలో పెట్టుకొని నాణ్యమైన సేవలు అందించాలన్నారు.

నిలువునా విరిగిపడిన సుంకిశాల గోడ అంటూ, కడుతున్న ప్రాజెక్టులో పెద్ద ప్రమాదం జరిగిందనేలా ఓ పత్రికలో వండి వార్చారని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లో నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టును 11 జూలై 2021న గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి జూలై 2023 న టన్నెల్ సైడ్ వాల్ పూర్తి చేశారని వివరించారు. అంటే వారు నిర్మించిన కాలేశ్వరం మేడిగడ్డ సుందిళ్ల మాత్రమే నాసిరకం అని అనుకున్నాం మిగిలినవి బాగా ఉన్నాయని నిన్నటి వరకు అనుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

వాళ్లు గోదావరి కాదు కృష్ణ నదిని కూడా వదిలిపెట్టలేదని సుంకిశాల గోడ కూలడంతో తేటతెల్లమైందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. మీ హయాంలో డిజైన్ల లోపంతో నిర్మించిన సుంకిశాల గోడలు కూలిపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు.. కాంగ్రెస్ రాగానే కూలిందని గత పాలకులు పత్రిక, టీవీ ఛానల్ లో సుంకిశాల పాపం వేరొకరిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు సంపాదించిన అక్రమ సంపాదన ఉందని సోషల్ మీడియాలో ఎవరిదో ఈ పాపం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గట్టిగా బుద్ధి చెప్పారు మరోసారి లేవకుండా చేస్తారని డిప్యూటీ సీఎం అన్నారు. సుంకిశాల సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని, దోషులు ఎవరో తేలుస్తామని డిప్యూటీ సీఎం అన్నారు.