బందరు భవిష్యత్తుకు నాదీ భరోసా

– గత పాలకులు నిధులివ్వకుండా అభివృద్ధిని దెబ్బతీశారు
– సమస్యల్లేని నియోజకవర్గంగా మచిలీపట్నాన్ని నిలుపుతా
– గ్రామ గ్రామానా అభివృద్ధి.. గడపగడపనా సంక్షేమం అందిస్తాం
– ఏడాదిలో బందరు పోర్టును పూర్తి చేసి చూపిస్తాం
– భారత్ పెట్రోలియం రిఫైనరీతో బందరు చరిత్రను తిరగరాస్తా
– ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాపార వేత్త ఉండేలా అభివృద్ధి
– ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: గ్రామ గ్రామానా స్పష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు, గడపగడపనా మెరుగైన సంక్షేమ పథకాలు అందించి నియోజకవర్గాన్ని అభివృద్ధికి రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పరిధిలోని 50వ డివిజన్, 24వ డివిజన్ల పరిధిలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల పేరుతో పేదల్ని దోచుకున్నారు. తాగునీరు, విద్యుత్ కనెక్షన్, మరుగు కాల్వలు కూడా లేకుండా పేదల్ని దగా చేశారు. మరోవైపు ఇల్లు మంజూరు చేయాలంటే లంచాలు డిమాండ్ చేసి పేదల్ని రోడ్డున పడేశారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు రోడ్డెక్కాలన్నా భయమే, ప్రశ్నించాలన్నా భయమే అన్నట్లు సాగింది.

వారి భయాలను, సమస్యల్ని నివృత్తి చేస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐదేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం లేదు. పెట్టుబడులు లేవు. ఉన్న పరిశ్రమల్ని తరిమేసి పైశాచిక ఆనందం పొందారు. అలాంటి సమస్యల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.

మంచి ప్రభుత్వం రావాలని ప్రజలంతా కోరుకున్నారు. 94 శాతం సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వంద రోజుల్లో చేసిన మంచిని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాం. త్వరలోనే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తాం.

గతంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు మళ్లీ దీపం పథకం కింద దీపావళి నుండి.. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించబోతున్నాం.