మద్యం టెండర్లకు నాకు సంబంధం లేదు

– టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య

నరసరావుపేట, మహానాడు: మద్యం టెండర్ల వ్యవహారంలో లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నాను అనే ఆరోపణలు అవాస్తవమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. నరసరావుపేట లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో నిర్వహించిన మద్యం టెండర్లలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తో చెప్పి షాపులు ఇప్పిస్తానని ఒక్కొక్క లిక్కర్ వ్యాపారి నుంచి రూ. 7 లక్షలు చొప్పున దాదాపు రూ.1.5 కోట్ల తీసుకున్నారని, వాళ్లకు లాటరీలో షాపులు ఇప్పించలేకపోయారని, లాటరీ లో షాపు రాని వారికి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటం లేదని ప్రధాన ఆరోపణ అని, దీనిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ లలో, వివిధ పత్రికల్లో కథనాలు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీని అడ్డం పెట్టుకుని ఒక రూపాయి సంపాదించలేదని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తాను ఎవరి వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదని, తీసుకున్నట్టు నిరూపిస్తే చట్టం విధించే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.

సొంత పార్టీ వారి పనే ఇది…
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కొంత క్యాడర్ పనిచేస్తోందని వాళ్లలో కొందరు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని అన్నారు. వాళ్లు నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారని నూతన మద్యం విధానంలో ప్రభుత్వ షాపులు రద్దుచేసి ప్రైవేటు షాపుల ఏర్పాటుకు లాటరీలు నిర్వహించగా నరసరావుపేట లోని ఆ వ్యాపారులు, సత్తనపల్లి, చిలకలూరిపేట వ్యాపారులతో కలిసి సిండికేట్ గా ఏర్పడి మద్యం టెండర్లు వేశారని అన్నారు.

వీళ్ళకి నరసరావుపేట టౌన్ లో ఐదు షాపులు, రూరల్లో ఒక షాపు, చిలకలూరిపేట కి ఒక షాపు, సత్తనపల్లి రూరల్ లో ఒక షాపు లాటరీ ద్వారా వచ్చాయని, అయితే నరసరావుపేట టౌన్ రూరల్ కు కలిపి 17 షాపులకు ఆరు షాపులు ఆ సిండికేట్ కి పోగా మిగిలిన 11మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులను కూడా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అది తప్పు అని చెప్పినా లెక్కచేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. అందువల్లనే ఎమ్మెల్యే పైన, తన పైన అవినీతి ఆరోపణలు సృష్టించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కొట్టా కిరణ్ కుమార్, బండారుపల్లి విశ్వేశ్వరరావు, వాసిరెడ్డి రవి తో పాటు మరికొందరు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.