– మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, మహానాడు: తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్ హెచ్చరించారు. మంత్రి కొండ సురేఖపై తాను వేసిన పరువు నష్టం దావాపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్ తెలిపారు.
ఒక ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను.. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు.. రాజకీయ విమర్శల పేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖ పై వేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది.