-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదారాబాద్ జూన్ 21మహానాడు: సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (ఏ) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉన్న దానిని పక్కనపెట్టి వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేననీ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి మల్లు విక్రమార్క మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి. రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ ఘనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. ఆ తర్వాత రానున్న ఐదు సంవత్సరాలలో అంటే 2032 నాటికి మరో ఐదు భూగర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడుతున్నాయి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడుతున్నాయి
ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము
సింగరేణి సంస్థకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నానన్నారు.
ఈ విషయంలో ప్రధానమంత్రి తో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి వారిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే మా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు నేను అఖిలపక్షంగా అన్ని పార్టీల వారు కూడా కలిసి ప్రధానికి విజ్ఞప్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేయాలని చేస్తారని భావిస్తున్నాం అన్నారు.
ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు, మరో నాలుగు వేల మెగావట్ల ప్లాంట్ ఎన్టిపిసి కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్ కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ని కలిసి ఈ విషయాలు వివరించి కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచర్ల బ్లాక్-2 కు అనుమతి ఇవ్వాలని కోరానన్నారు.
ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి ని కోరేది ఏంటంటే సింగరేణి సంస్థ బతకాలన్నా, దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృశ్య సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరం అన్నారు.
గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3 లను పొందిన ప్రైవేటు కంపెనీల వారు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాను. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుంది.
135 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడిచిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్తుపై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాక్లు దక్కించేలా చూడాలని, అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం మనందరికీ సంతోషకరం అన్నారు.
సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, ఉద్యోగాల గని అని కూడా పేరుంది. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న గోకుతూనే మన రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు అలాగే మన పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభ పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
ఎం ఎం డి ఆర్ ( మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ ))యాక్టు సవరణ జరగక పూర్వం అంటే 2015 కు ముందు ఈ ప్రాంతంలోని బొగ్గు నిలువల్ల పైన సింగరేణి సంస్థకే పూర్తి అధికారం ఉండేది. త్రై పాక్షిక ఒప్పందం ప్రకారం గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతాల్లో సింగరేణికి 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఇవ్వబడి ఉన్నాయి. వీటిలో 388 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3008 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశం ఇవ్వబడింది. అయితే ఇప్పటివరకు దీనిలో సగం అంటే 15 85 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే తీయడం జరిగింది. ఇంకా 14 22 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉంది.
అపార అనుభవం గల సింగరేణి సంస్థ ఈ బొగ్గును వెలికి చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ 2015 లో సవరించబడిన ఎం ఎం డి ఆర్ చట్టం ప్రకారం ఇప్పుడు గోదావరి ప్రాణహిత ప్రాంతంలో సింగరేణికి ఉన్న లీజు హక్కును కోల్పోవాల్సి వచ్చింది. ఏ కొత్తగని తవ్వాలన్నా సరే గతంలో మాదిరిగా కాకుండా సవరించిన కొత్త చట్టం ప్రకారం బ్లాకులను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త చట్టంలోని రిజర్వేషన్ పద్ధతి ప్రకారం సింగరేణికి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారం తమకు అతి ముఖ్యమైన నాలుగు బొగ్గు బ్లాక్లు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ -3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాకు, పీకే ఓసి డిప్ సైడ్ బ్లాక్ లు ఉన్నాయి. ఈ బ్లాకులో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాక్ లను ఆనుకొని పాత గనులు నడుస్తున్నాయి. ఈ బ్లాకులో కేటాయిస్తే ఎక్కువ ఖర్చు కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్ తో సింగరేణి వెంటనే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.
అలాకాకుండా ఈ నాలుగు బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారం అని ఆయన అన్నారు.