Mahanaadu-Logo-PNG-Large

విద్య సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ

యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు

నరసరావుపేట , మహానాడు:  విద్య సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడినా, ర్యాగింగ్ ను ప్రోత్సహించినా, మాదక ద్రవ్యాలను వినియోగించినా, వాటిని సరఫరా చేసినా ఊరుకునేది లేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో సుమారు 200 మందితో యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ..  ర్యాగింగ్ అనేది లేకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల్లో అందరికీ కనిపించేలా ర్యాగింగ్ చట్టాలని గోడలపై ప్రచురించాలని సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా గురించి నిఘా పెట్టాలన్నారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి వివరించారు. నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాలు (గంజాయి) సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని, చట్టాన్ని చేతుల్లోకి  తీసుకొని గోడవలకు  దిగరాదని సూచించారు. సంఘ విద్రోహ శక్తులైన రౌడీలను,గుండాలను, ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని  ఉపేక్షించేది లేదని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.