– టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ప్రశ్న
విజయవాడ, మహానాడు: రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పరితపిస్తుంటే.. వైసీపీ నేతలకు అది నచ్చడం లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 15 వేలకి వైసీపీ నేతలు అమ్ముకుంటే.. ఇప్పుడు కేవలం 1,500కే ఇసుక అందుబాటులోకి వచ్చిందని ఆయన వెల్లడించారు. నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చిన వైసీపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు.. తాము కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే.. వైసీపీ నాయకుడు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా భయపడేవాడని కోటంరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందని విమర్శించారు. అందరికీ అమ్మబడి ఇస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే ఇంట్లో ఒక్కరికే ఇస్తానని మాట మార్చిన విషయం వైసీపీ నేతలకు గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. ఇసుకను ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే అంటూ ఆయన అన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు మామిడాల మదు, కువ్వారపు బాలాజీ, అంచురి శ్రీనివాసులు నాయుడు, జహీర్, మొయుదిన్, కేపీ చౌదరి, తంబి, సుజన్, నారాయణ రెడ్డి, సుధా ఇతర నేతలు పాల్గొన్నారు.