రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా?

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

ఆదిలాబాద్‌, మహానాడు: రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని శవయాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్టు చేయడంపై ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. రైతు రాజ్యం కాదిది .. పోలీసు రాజ్యం. నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు .. అణచివేస్తే ఆగిపోతుంది అనుకోవడం అవివేకం. రూ.15000 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు రుణాలు తీర్చేశాం అని చెప్పుకున్నారు. మరి అన్ని రుణాలు మాఫీ అయితే ప్రభుత్వానికి ఉలుకెందుకు?

రాష్ట్రంలో రైతులు రోడ్డెందుకు ఎక్కుతున్నారు? రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ పూర్తయిందని సీఎం, మంత్రుల అబద్దపు ప్రకటనల కారణంగానే రైతులు ఆందోళనకు గురై నిరసనలు తెలుపుతున్నారు. అధికార పీఠం ఎక్కగానే కాంగ్రెస్ నేతల కళ్ళు నెత్తిమీదకు ఎక్కాయి.  రాబోయే రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వానికి పాడె కడతారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, రైతుకూలీలు, మహిళలు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని ఆరోపించారు. రైతుల మీద పెట్టిన కేసులను భేషరతుగా వెనక్కి తీసుకోవాలి.. అరకొర రుణమాఫీ చేసి రైతుల ఆందోళనకు, మానసిక వేదనకు కారణం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలని నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.