తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన
ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది
సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే
అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ
తెలంగాణ లో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది
– స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ప్రజాపాలన సాగుతోందని, తెలంగాణ సమాజం స్వేచ్ఛాస్వాంతంత్య్రాలతో జీవిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్యూచర్ స్టేట్‌గా మార నున్న తెలంగాణ రాష్ట్రం, త్వరలో దేశంలోనే అగ్రస్థాయికి చేరుతుందన్నారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వ విజయాలను ప్రస్తావించిన రేవంత్.. గత సర్కారు చేసిన ఆర్ధికవిధ్వంసాన్ని ఎదుర్కొని, ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమపథకాలు అమలుచేస్తున్నామని గుర్తు చేశారు.
స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.
ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో గమ్యం చేరినట్టు కాదు.
పంచవర్ష ప్రణాళికలు రచించి, ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్లు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ, ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చతోరణాన్ని కట్టుకున్నాయంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే… ఆ తర్వాత వాటిని పూర్తి చేసి, కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాలు పారించిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకి దక్కుతుంది.
అంతేకాదు, పారిశ్రామికంగా BHEL, ECIL, IDPL, మిథాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినవే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్నిరంగాల సమగ్రాభివృద్ధికి కృషిచేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడుకి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆ నాటి దార్శనికుల వల్లనే జరిగింది.
1947 వరకూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మనదేశం, ఈ నాడు ప్రపంచంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన హరిత విప్లవమే.
ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించే అతికొద్ది దేశాల సరసన భారతదేశాన్ని ఆనాడే నిలుపగలిగారు.
ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004 లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు. వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో… ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది.
మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. మా వాదం గాంధేయవాదం. మహాత్ముడి దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ విమోచనం మాత్రమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వాతంత్ర్యానికి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది. నాటి బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా ఐతే విముక్తి చెందిందో… అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువై ఉంది. తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతోంది.
. గడచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు… మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచేశాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం.
ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి… మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇంతటి వ్యవస్థలో లోటు పాట్లు ఉండొచ్చు. మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం.
ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం.ఎన్నికల సందర్భంలోనే చెప్పాం. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈ రోజు అక్షరాలా అది చేసి చూపిస్తున్నాం.
ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది.
ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ…” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం. తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం. తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో TS స్థానంలో TGని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల ఆకాంక్ష.
మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం.
ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి… రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోం. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
మహాలక్ష్మి పథకం అమలు
ప్రభుత్వంలో మేం కుదురుకోక ముందే. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు 2,619 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం అని గర్వంగా చెప్పగలను.
రాజీవ్ ఆరోగ్యశ్రీలో మరో 163 చికిత్సలు మిత్రులారా…
రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నది మా ఆశయం. ఈ రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ కి పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలుపరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉ చితంగా అందించే వైద్యచికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం.
కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చాం. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20శాతం పెంచాం. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించాం.
ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, విస్తృత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీచేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి, సులభంగా రోగనిర్ధారణ, సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకే ఈ ఆలోచన చేశాం.
రూ. 500 కే వంటగ్యాస్ సిలెండర్
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014 లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ బండ ధర 410 రూపాయలు మాత్రమే. పదేళ్లలో దానిని 1200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు.
అందుకే తిరిగి దాన్ని 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి, 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం… ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 85 లక్షల 17 వేల 407 సిలిండర్లకు గాను 242 కోట్ల రూపాయలు చెల్లించాం.
గృహజ్యోతి తో పేదల ఇంట వెలుగులు
అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారదోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలుచేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రజాపాలన సేవాకేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 47 లక్షల 13 వేల 112 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ళు
ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ళ చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణ మాఫీ
మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్ లో వ్యవసాయ, అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులు పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోంది. రైతులకు కావలిసిన ఎరువులు, విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది వానాకాలం పంటకు జూలై 24 నాటికి 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం. ఇప్పటికీ ఇంకా 10.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రంలోని రైతాంగం నేడు అతి పెద్ద పండుగ జరుపుకుంటోంది. ఇంతకాలం రుణ భారంతో బతుకుభారమైన తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషను అనుగుణంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇది అసాధ్యమని చాలా మంది వక్రభాష్యాలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకూ ఏక కాలంలో రుణ మాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం.
దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలచుకున్నాను… పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే… వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది.
తొలిదశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణ మాఫీ సొమ్ము 6,098 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11 లక్షల 50 వేల మంది రైతన్నలు రుణవిముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతుల ఖాతాలో జమ చేసింది. దీనివల్ల 6 లక్షల 40 వేల 823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా, 2 లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈ రోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే… తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. ఎందుకంటే, దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31 వేల కోట్లు వెచ్చించి… రైతును రుణ విముక్తుడిని చేస్తున్నాం.
రైతు భరోసా
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు.
దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది.
ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నాం.
సన్న వడ్లకి రూ.500 బోనస్
మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించాం.
రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచాం. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
పంటల బీమా పథకం
రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి “రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
ధరణి సమస్యలకు పరిష్కారం…
రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగింది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ‘ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యల పరిష్కారం, పరిష్కారం చేయలేనివి ఉంటే సదరు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నాం.
మాదక ద్రవ్యాల పై ఉక్కుపాదం
నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు… మొత్తం జాతే నిర్వీర్యం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆందోళన కరమైన అంశం. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.
డ్రగ్స్ నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తున్నాం. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (టీ-న్యాబ్)ను బలోపేతం చేశాం. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 నెంబర్ 24 గంటలు పని చేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడి లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని సంకల్పించాం.
పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 65 ప్రభుత్వ ఐ.టి.ఐ లను టాటా సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం.
ఇటీవలే బేగరి కంచె వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతోంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతోంది. సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతోంది. ఈ యూనివర్సిటీకి మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్ గా నియమించాం.
ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ – హైదరాబాద్
రంగుల మేడలు, అద్దాల గోడలు కాదు. ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పులు రావాలి. దానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలి. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవేదిక పై సగర్వంగా చాటాలి. అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను, శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించాం.
ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగరి కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ, తదితర ఆలోచనలను వారితో పంచుకున్నాం.
జనవరిలో దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేం విశ్వసిస్తున్నాం.
నగరానికి హైడ్రా సేవలు
కొత్త నగర నిర్మాణమే కాదు. ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని చేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతోపాటు, విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత హైడ్రాకు పెట్టాం.
యువతకు ఉద్యోగావకాశాలు
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా జరిపించాం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ని విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ నియామక వయోపరిమితిని కూడా 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచాం.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం. ఇటీవలే శాసనసభలో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టాం. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా. మీ సమస్యలు ఏమైనా ఉ ంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం.
చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకో వద్దు. ఎవరి ఉద్యోగాల కోసమో… మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు నేను అండగా ఉంటా. సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం.
ఇందిరా మహిళా శక్తి పథకం
రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది.
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణబీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీచేయడం జరుగుతుంది. స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించడంతో పాటు, వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం.
ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు 10 లక్షల ప్రమాద జీవిత బీమా చేయడం జరిగింది.
విభజన సమస్యలు పరిష్కారం దిశగా..
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్దకాలంగా ఏవిధమైన ప్రయత్నాలూ జరగక పోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు కూడా తేలాల్సి ఉంది. మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం. రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరం పరిష్కరించు కోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నాం.
ఇది ప్రజా ప్రభుత్వం. ప్రతి ఒక్కరి ప్రభుత్వం. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ… ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ… సంక్షేమానికి పెద్దపీట వేస్తూ… విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ… దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ… మరొక్కసారి అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
చివరిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి ఈ పర్యటన ద్వారా పరిచయం చేశాం. ఇదొక గొప్ప ముందడుగు. భవిష్యత్ లో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని… రైతులు, యువత, మహిళ, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ… అందరికీ ధన్యవాదాలు.
జై హింద్…జై తెలంగాణ