ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించారు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏకం కావాలి
పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్
సర్పంచులు`గ్రామాల సమస్యలపై అఖిలపక్ష సమావేశం
రాజమండ్రి, మహానాడు : సర్పంచులు`గ్రామాల సమస్యలు అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రివర్ బే హోటల్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్‌ను ఓడిరచడమే ఏకైక మార్గమ ని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష న్ నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14,15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8629 కోట్లు దారి మళ్లించి సొంత పథకాలకు వాడుకున్నారని మండిపడ్డారు.
మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి పంపిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.988 కోట్లను గ్రామపంచా యతీలకు జమ చేయనందున వేసవికాలంలో కనీసం గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అందుకే ఆయనను ఓడిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సర్పంచు లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రతినిధి, పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని, అందులో భాగంగానే 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని చేసిందన్నారు.
బీజేపీ నాయకులులు పడిమి రాధా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కూడా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.988 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చావా శ్రీను మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు నిధులు విడుదల చేసిందని, భవిష్యత్తులో కూడా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని వివరించారు. జనసేన పార్టీ నాయకులు ఉప్పులూరి బాబ్జి మాట్లాడుతూ గ్రామ ప్రభుత్వాల ఏర్పాటే లక్ష్యంగా మా పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నాగబత్తుల శాంతకుమారి, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి జల్లి బాలరాజు, సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభాత్, రాష్ట్ర కార్యదర్శి బుచ్చిరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రంబాల రమేష్, సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర నాయకులు సావిత్రి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.