సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా
నిందితులపై ఐటీ, పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తాం
డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా హెచ్చరిక
కౌంటింగ్ నేపథ్యంలో సూచనలు
అమరావతి: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాల్ విసురుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని వివరించారు. రెచ్చగొట్టే పోస్టులను, ఫొటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం కూడా నిషిద్ధమని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు.