ఆ పార్టీలో జగన్ ఒక్కరే మిగులుతారు
– టీడీపీ ఎమ్మెల్యే గంటా
విశాఖ: తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. గతంలో వైసీపీ మునుగుతున్న నావ అని అన్నానని, అది ఇప్పుడు మునిగిపోయిన నావ అని ఎద్దేవా చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా పార్టీలోకి రావడానికి వరదలాగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలా పార్టీలోకి వచ్చిన వారు, తమ పదవులకు రాజీనామా చేసి రావాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారని గంటా అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన వారిని స్వాగతిస్తామని పేర్కొన్నారు.
మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్, పోతుల సునీత.. తమ పదవులకు రాజీనామా చేశారని, మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడతారని గంటా జోస్యం చెప్పారు. ఆ పార్టీలో జగన్ ఒక్కరే మిగులుతారన్నారు. వైసీపీ ఈ దుస్థితికి కారణం ముమ్మాటికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డేనని గంటా స్పష్టం చేశారు.
ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని, తీరును మార్చుకోవాలని గంటా హితవు పలికారు. అలా చేస్తే కనీసం వచ్చే ఎన్నికలు నాటికైనా వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు.