– ఆ గోవులను కోర్టులో ప్రవేశపెట్టండి
– ఏపీ హైకోర్టు చరిత్రలో జంతువుల కోసం తొలిసారి హెబియస్ కార్పస్ పిటిషన్
– గో సంతతి అక్రమ తరలింపు పై విజయవాడ పోలీసులపై మండిపడ్డ హైకోర్టు
విజయవాడ శివార్లలో బక్రీదు పండుగ ముందురోజు 195 సంఖ్యలో గోసంతతి అనుమానాస్పదంగా కనపడడం కల్లోలమైన విషయం విదితమే. పండుగ సందర్భంగా వధించేదుకు ఆ గోసంతతిని తీసుకెళ్తున్నారని హిందూ సంఘాలు ఆందోళన చేపట్టడం.. మహ్మదీయ మతపెద్దలు గోసంతతిని తమకు అప్పజెప్పాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో, పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్పి తాత్సారం చేసి, చివరగా తాము చేయగలిగింది ఏమీ లేదని చేతులెత్తేశారు.
ఈ విషయమై నగరానికి చెందిన తోట సురేష్ బాబు, గోపాల రావు అత్యవసర విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషనర్ల తరఫున న్యాయవాది జె.వి.ఫణిదత్ చాణక్య వాదనలు వినిపిస్తూ, జంతువులకి కూడా మనుషుల మాదిరిగానే జీవించేహక్కు ఉందన్న సుప్రీం ధర్మాసనం తీర్పుని ఉటంకిస్తూ, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం గోసంతతి లంపీ స్కిన్ వ్యాధితో బాధపడుతున్నాయని, శారీరకంగా దీనస్థితిలో ఉన్నాయని, వాటిని బహిరంగంగా ఉంచకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, అవన్నీ 10సం.ల లోపు వయస్సు గలవని, వధించేందుకు అనర్హమైనవని, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండా, వాటి యొక్క సంక్షేమం పరిరక్షకుండా, పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ గోసంతతిని ఎవరికీ తెలియని ఒక ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించారని తెలిపారు.
మతపరమైన ఒత్తిళ్ళకి లొంగి పోలీసు నగర ఉన్నతాధికారులు సైతం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందువల్ల వాటిని సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, మంగళవారం రాత్రే ఉమర్ ఫరూక్ అనే వ్యక్తికి గోసంతతి అప్పజెప్పామని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయవాది ఫణిదత్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన తరువాత ఆదరబాదరాగా గోసంతతిని అప్పజెప్పారని తెలుపగా, ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా మండిపడింది.
195 సంఖ్యలో గోసంతతికి ఒక వ్యక్తి యజమాన్యం కోరితే, ఎటువంటి విచారణ చేపట్టకుండా, కనీసం ఫోన్ నంబరుగానీ, ఎటువంటి హామీని గానీ కోరకుండా, అడిగిన వారికి ఎలా అప్ప చెబుతారు? ఇంకేదైనా కేసులో బంగారం దొరికితే ఇలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించకుండా ఎవరికైన ఇచ్చేస్తారా? అని నిలదీసింది.
ప్రస్తుతం జంతువుల స్థితిగతులని తెలుపుతూ వివరమైన ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ముఖ్య ప్రాధాన్యత కలిగిన కేసుగా పరిగణిస్తూ ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా, జంతువులని ప్రవేశపెట్టమని కోరుతూ హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇదే ప్రథమం.