తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: తప్పుడు పనులు చేసి, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని జేబులు నింపుకొన్న వారు మాత్రమే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. 2019 లో ఓడిపోయినప్పటికీ, ప్రజల్లోనే ఉంటూ, ప్రజల కోసం పని చేశాను. తత్ఫలితంగానే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కల్పించారు. వారి అభిమానాన్ని గౌరవిస్తూ గెలిచిన రోజు నుండి నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను అని తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

జగన్ రెడ్డి పాలనలో గాలికి వదిలేసిన అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టిస్తున్నాను. మున్సిపల్ సిబ్బందిని, అధికారుల్ని వెంట పెట్టుకుని క్లీన్ నరసరావుపేట కోసం తపిస్తున్నాను. నియోజకవర్గం వ్యాప్తంగా మురుగు కాల్వలు శుభ్రం చేసి, తాగునీరు, శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. పట్టణంలో 80 శాతానికి పైగా కాలువల్ని క్లీన్ చేసి మురుగు లేని విధంగా తయారు చేశాను అన్నారు. గెలిచిన రోజు నుండి కూడా నియోజకవర్గంలో అక్రమ వ్యాపారాలు, దందాలు, గుట్కా, మట్కా, కల్తీ మద్యం, పేకాట, కోడిపందాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అవి చూసి వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, కడియం కోటి సుబ్బారావు పాల్గొన్నారు.