రూ.100తో సభ్యత్వం ఉంటే రూ.5 లక్షల ప్రమాద బీమా!

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం గర్నెపూడి, పెదమక్కెన గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదును శనివారం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం తీసుకుందాం.. కార్యకర్తగా గర్వపడదాం.. అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ అని, పార్టీ సభ్యత్వ నమోదు-2024 కార్యక్రమం ప్రారంభమైందని, వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే.. ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుందని తెలిపారు.

దేశంలోనే క్రమశిక్షణ, అంకితభావం కలిగిన శ్రేణులు తెలుగుదేశం పార్టీ సొంతం.. పసుపు పండుగకు సమయం వచ్చింది… పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా సభ్యత్వం తీసుకొని పార్టీని సగర్వంగా దేశంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీగా నిలుపుదామని పిలుపునిచ్చారు. పార్టీ శాశ్వత సభ్యత్వం ఈ రోజే నేను తీసుకున్నాను. సభ్యత్వ నమోదుకు నా వంతుగా 1 లక్ష నగదు అందజేశాను. పార్టీ పట్ల ఆదరాభిమానాలతో సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహిద్దాం. సభ్యత్వ నమోదులో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.