నాన్ సీరియస్‌గా ఉంటే ఎలా?

– మీ పనితీరు మెరుగుపరచుకోండి
– కొంతమంది పోలీసులు ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు
– సోషల్‌మీడియాలో వచ్చినా నో యాక్షన్
– ఇంకా వైసీపీ అధికారులే ఉన్నారు
– అందుకే ఆ రకంగా స్పందించాల్సి వచ్చింది
– అనితపై తన వ్యాఖ్యలకు పవన్ వివరణ
– ఇకపై సోషల్‌మీడియా పోస్టింగులపై చర్యలుంటాయని చంద్రబాబు హామీ
– క్యాబినెట్ భేటీలో వాడి వేడి చర్చ

అమరావతి: చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్ నెస్ రాలేదని, కొందరు మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మెతక వైఖరి విడనాడాలని, గత ప్రభుత్వ హయాంలో విమర్శలు ఎదుర్కొన్న కొందరు అధికారులు ఇప్పటికీ తీరు మార్చుకోలేదని, అలాంటి వారి కారణంగా మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కొందరు మంత్రులు అటు పార్టీ-ఇటు తమ శాఖల సమన్వయంలో శ్రద్ధ చూపడం లేదని, వారికి కొంత సమయం ఇస్తామన్నారు. ప్రత్యర్ధి పార్టీల నుంచి విమర్శలను కొంతమంది మంత్రులు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ జరిగింది. ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు పదేపదే పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, ఫోన్ చేసినా కొందరు ఎస్పీలు స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కు అనుకూలంగా పని చేసిన కొందరు పోలీసు అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని, కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇళ్లలో ఉన్న మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని, అందుకే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని చెప్పారు.

దానిపై స్పందించిన చంద్రబాబునాయుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే సోషల్‌మీడియా పోస్టింగ్‌లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని, ఆ మేరకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

పనిచేయని అధికారుల తీరును పరిశీలించిన తర్వాత, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ తన ఐదేళ్ల కాలంలో పనిచేసిన అధికారులు ఇకనయినా పద్ధతి-పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ అయినందున, వచ్చే ప్రతి ఫిర్యాదుపై సీరియస్‌గా స్పందించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.