ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి

ప్ర‌పంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిథులు స‌మావేశ‌మైన‌ట్లు మంత్రి టి.జి తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.

వియత్నాంలో ఎంతో పేరుగాంచిన ఈ సంస్థ ఏపీలో రూ. 4 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి క‌ర్నూలు జిల్లా ఓర్వ‌కల్లులో కానీ క్రిష్ణ‌ప‌ట్నంలో కానీ ఎల‌క్ట్రానికి వెహిక‌ల్‌, బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను పెట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అన్నివిధాలా అవ‌స‌ర‌మైన భూమి, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. 30 రోజుల తర్వాత రాయితీలపై చర్చించి అంతా ఒకే అయితే కంపెనీ ఎక్క‌డ ఏర్పాటుచేసే విషయం తెలుస్తుంద‌న్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలివస్తున్నారన్నారు. అంత‌కుముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కంపెనీ ప్ర‌తినిధుల‌కు విందు ఇచ్చారని మంత్రి తెలిపారు