పార్వతీపురంలో యువనేతకు వినతుల వెల్లువ

పార్వతీపురం: పార్వతీపురంలో వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేతకు పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించారు. వీఆర్ఏ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్ కు సమస్యలు విన్నవిస్తూ జీవో నెం.104 ప్రకారం వీఆర్వో ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న ప్రమోషన్ కోటాను 70శాతానికి పెంచాలని విన్నవించారు.

యూటీఎఫ్ ప్రతినిధులు లోకేష్ కు వినతపత్రం ఇస్తూ ఏజెన్సీలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేసేలా గతంలో ఇచ్చిన జీవో నెం.3ని పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా ప్రాథమిక విద్యారంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో నెం.117ను రద్దు చేయాలని విన్నవించారు. సీపీఎస్, జీపీఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

గోపాలమిత్ర అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను విన్నవిస్తూ గత 24 సంవత్సరాలుగా పశుసంవర్థకశాఖలో పనిచేస్తున్న 2600 మంది గోపాలమిత్రలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సమస్యలు సావనధానంగా విన్న లోకేష్ రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.