-ఏండియూ ఆపరేటర్ కంటే తక్కువ వేతనాలు
-కూటమి ప్రభుత్వమైనా మా కష్టాలు తీర్చాలి
-గ్రామ రెవెన్యూ సహాయకులు బొప్పరాజు, గరికపాటి బ్రహ్మయ్య
అమరావతి, మహానాడు : దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు గత ప్రభుత్వ హయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, గత ఆరు సంవ్సరాలుగా జీతం ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు బొప్పరాజు, గరికిపాటి బ్రహ్మయ్య, ఆర్.వి.రాజేష్, డి.శ్రీనివాస్ లు అన్నారు. గత ప్రభుత్వంలో సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోయాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను రాష్ట్ర సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అనేక సంవత్సరాలుగా గ్రామ రెవెన్యూ సహాయకులు నెలకు కేవలం రూ. 1700/- లు గా గౌరవ వేతనం పొందుతుండగా, 2011 లో రూ. 3000/- లకు పెంచారు. 2014 లో 6500/- కు పెంచారు. మరో నాలుగేళ్లకు 2018 లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రూ .10,500/- లకు పెంచారు. కానీ, గత ఆరు 6 సంIIరాలుగా ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచకుండా గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులు కు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
ఏండియూ ఆపరేటర్ కంటే తక్కువ వేతనాలు
రెవెన్యూ శాఖలో కేవలం నెలకు 15 రోజులపాటు రేషన్ షాప్ లకు బియ్యం పంపిణీ చేస్తున్న వాహన ఆపరేటర్లకు (MDU) చెల్లించే జీతం (21,000/-) కన్నా, అతి తక్కువ వేతనాన్ని 24 గంటలూ పనిచేసే గ్రామ రెవెన్యూ సహాయకులకు కేవలం రూ|| 11,100 రూపాయలు జీతం ఇస్తున్నారు.
వెనక్కి తీసుకున్న కరువు భత్యం తిరిగి చెల్లించాలి
గత ప్రభుత్వ హయంలో అనేకసార్లు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ గ్రామ రెవెన్యూ సహాయకులకు ఎలాంటి సహాయం చేయకపోగా…. 2018 నుండి 2021 వరకు చెల్లించిన కరువు భత్యాన్ని వారి జీతాల నుంచి షుమారు 13.44 కోట్లు రికవరీ చేయడం దారుణ పరిణామమన్నారు.
కరువు భత్యంను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఏ.పి.జే.ఏ.సి.పక్షాన చేసిన 92 రోజుల ఉద్యమం చేయడంతో 2024 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులు కరువు భాత్యాన్ని ప్యురుద్దరిస్తూ రూ.500/- మంజూరు చేస్తూ వేతనం తో పాటు చెల్లిస్తున్నారు.
2018 నుండి 2021 వరకూ చెల్లించిన కరువు భత్యాన్నీ రికవరీ చేయడంతో, చాలీచాలని జీతంతో బ్రతుకున్న చిరుద్యోగులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ రెవెన్యూ శాఖా మంత్రికి వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వమైనా మా కష్టాలు తీర్చాలి
రాష్ట్రంలోని వేలాది మంది గ్రామ రెవెన్యూ సహాయకులు గత ఆరు సంవ్సరాలుగా తీవ్రంగా నష్టపోయారని, వారందరూ నూతన ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని, ప్రభుత్వం వీరి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.