నూతన మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండిచెయ్యి!

– ఎన్నికల్లో ప్రాణాలొడ్డి ఎదుర్కొన్న నాయకులు
– ఏడు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం
– అయినా సీనియర్లను పరిగణలోకి తీసుకోని అధినేత
– తీవ్ర నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు

(వాసిరెడ్డి రవిచంద్ర)

పల్నాడు జిల్లా: ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. వెనుకబడిన పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. నరసరావుపేట పార్లమెంటుతో సహా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. గెలుపొందిన సీనియర్లు కూడా ఉన్నారు. అయితే వారిని పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో పల్నాడు ప్రాంతంలోని గ్రామాల్లో వైసీపీ నాయకుల దాడులు, వేధింపులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు, పొలాలు బీళ్లు పెట్టి వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఐదేళ్ల పాటు వనవాసం చేసి సార్వత్రిక ఎన్నిక ల సందర్భంగా గ్రామాలకు చేరుకుని ఎన్నికల్లో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లాకు చెందిన విడుదల రజిని, అంబటి రాంబాబులకు మంత్రి పదవులు దక్కాయి.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి లభించింది. దీంతో ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు తెగబడినా సీనియర్ల అండతో ఎదుర్కొని ఎదురొడ్డి నిలిచారు. ఎన్నికల సంఘం స్పందించి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ‘‘సిట్‌’’ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. కలెక్టర్‌, ఎస్పీ, డీఎస్పీ లు, సీఐలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. పల్నాడులో జరిగిన గొడవలు జాతీయ స్థాయిలో సంచలనం కలిగించాయి. అయితే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో పల్నాడు జిల్లాకు మంత్రి పదవి లభిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూశారు. జిల్లా నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచిన జి.వి.ఆంజనేయులు, పల్నాడులో వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిలలో ఒకరికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఎదురుచూశారు. సీనియర్‌ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు కూడా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. దాంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అయినా పల్నాడుకు స్థానం లభిస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.